కరీంనగర్, నిఘా న్యూస్: మొంథా తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు తీవ్ర వర్షాల బారిన పడ్డాయి. అయితే ఆంధ్రప్రదేశ్‌తో పోలిస్తే తెలంగాణలో వర్షాలు మరింత తీవ్రముగా కురిశాయి. ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో పలు మండలాలు వరద నీటిలో మునిగిపోయాయి. ఇప్పటికే పంటలు కోసి ధాన్యం ఆరబెట్టే పనుల్లో ఉన్న రైతులు ఒక్కసారిగా కురిసిన వర్షాల కారణంగా తీవ్ర నష్టాన్ని ఎదుర్కొన్నారు. వేల ఎకరాల్లో ఉన్న పంటలు నీటమునిగిపోయి రైతులు ఆర్థికంగా కుదేలయ్యారు.
ఈ నేపథ్యంలో రైతుల బాధను గుర్తించిన జర్నలిస్టు సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు చీకట్ల శ్రీనివాస్ స్పందించారు. తుఫాను కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వాలు తక్షణమే ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ధాన్యం ఆరబెట్టే దశలో వర్షం కురవడం వల్ల ఆ పంట మొత్తం పాడైపోయిందని, రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని శ్రీనివాస్ పేర్కొన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే నష్టపరిహారం చెల్లించి రైతులకు భరోసా ఇవ్వాలని ఆయన అన్నారు.
చీకట్ల శ్రీనివాస్ మాట్లాడుతూ, “ప్రతి సంవత్సరం తుఫాన్లు, వర్షాలు రైతులపై భారం పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రైతు కుటుంబాల పట్ల ప్రభుత్వాలు సహానుభూతితో వ్యవహరించాలి. కేవలం వాగ్దానాలతో కాకుండా ఆచరణలో నష్టపరిహారం చెల్లించి వారి జీవనోపాధి కొనసాగేందుకు సాయం చేయాలి,” అని పేర్కొన్నారు. అలాగే, వ్యవసాయ శాఖ అధికారులు గ్రామ గ్రామాన తిరిగి నష్టం అంచనా వేయాలని, రైతులకు బీమా సదుపాయాలు సులభతరం చేయాలని ఆయన సూచించారు.


