- – కాంగ్రెస్ మద్దతు అభ్యర్థుల గెలుపు కోసం
- వ్యూహాత్మక ప్రచారం
– బ్యాంక్ విస్తరణపై ప్రత్యేక దృష్టి
కరీంనగర్, నిఘా న్యూస్:కరీంనగర్ అర్బన్ బ్యాంక్ ఎన్నికల వేడి రోజురోజుకీ పెరుగుతోంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చే మద్దతు అభ్యర్థుల తరపున ప్రచార బాట పట్టిన పార్టీ సీనియర్ నాయకుడు వెలిచాల రాజేందర్‌రావు చురుకైన పాత్ర పోషిస్తున్నారు. అభ్యర్థుల విజయం కోసం రాజేందర్‌రావు రూపొందించిన ప్రత్యేక వ్యూహం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.ఒకప్పుడు కేవలం కరీంనగర్ నగరానికే పరిమితమైన అర్బన్ బ్యాంక్, ఇప్పుడు నియోజకవర్గ వ్యాప్తంగా విస్తరించేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. గ్రామీణ ప్రజలకు ఆర్థిక సేవలు చేరేలా, సభ్యుల సంఖ్యను పెంచేలా చర్యలు చేపట్టాలని రాజేందర్‌రావు భావిస్తున్నారు. ఈ దిశగా బ్యాంకు విస్తరణకు బ్లూ ప్రింట్ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
పార్టీ మంత్రులు, జిల్లా కాంగ్రెస్ నాయకులతో సమన్వయం చేస్తూ బ్యాంకును అభివృద్ధి దిశగా నడిపేందుకు ఆయన కృషి చేస్తున్నారు. సేవల్లో పారదర్శకత, సభ్యుల సౌకర్యం, ఉపాధి అవకాశాల కల్పన వంటి అంశాలపై రాజేందర్‌రావు ప్రత్యేక దృష్టి సారించారు.కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం పాదయాత్రలు, సమావేశాలు, డోర్ టు డోర్ ప్రచారం నిర్వహిస్తూ ప్రజల్లో ఉత్సాహం నింపుతున్నారు.
“అర్బన్ బ్యాంక్ కేవలం ఆర్థిక సంస్థ కాదు, ప్రజల అభివృద్ధి వేదిక” అని రాజేందర్‌రావు స్పష్టం చేశారు. ఆయన మార్గదర్శకత్వంలో అభ్యర్థులు బలపడినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.అర్బన్ బ్యాంక్ అభివృద్ధి కోసం రూపుదిద్దుకున్న ఈ కొత్త వ్యూహం ఫలిస్తే, కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో ఆధిపత్యం మరింత బలపడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.


