కరీంనగర్, నిఘా న్యూస్: తెలంగాణా రాజకీయాల్లో కీలకమైన కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్ష పదవి నియామకంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ ప్రతిష్టాత్మక పదవిని దక్కించుకోవడానికి పలువురు సీనియర్ నేతలు గట్టి ప్రయత్నాలు చేస్తుండగా, ముఖ్యంగా ఇద్దరు బలమైన ఆశావాహుల మధ్య తీవ్రమైన పోటాపోటీ కనిపిస్తోంది.
ఆశావాహులు.. దరఖాస్తులు
కరీంనగర్ డీసీసీ అధ్యక్ష పదవి కోసం మొత్తం 36 మందికి పైగా ఆశావహులు దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించిన కాంగ్రెస్ అధిష్టానం.. ఇటీవల వివిధ స్థాయిల్లో నూతన కమిటీల నియామక ప్రక్రియ చేపట్టింది. ఇందులో భాగంగా డీసీసీ అధ్యక్ష పదవికి దరఖాస్తులు స్వీకరించింది.
కీలక నేతల పోరు
రేసులో ఉన్న ఆశావాహుల్లో ఇద్దరు ప్రముఖులు.. వెలిచాల రాజేందర్ రావు మరియు ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి తీవ్రంగా పోటీ పడుతున్నారు.వెలిచాల రాజేందర్ రావు గతంలో కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన రాజేందర్ రావు.. ఈ పదవి తనకు దక్కడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు.నరేందర్ రెడ్డి ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి కూడా డీసీసీ పగ్గాలు చేపట్టడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ పదవి కోసం ఆయన అధిష్టానం వద్ద చురుగ్గా సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.వీరితో పాటు, ఆకారపు భాస్కర్ రెడ్డి వంటి ఇతర సీనియర్ నాయకులు కూడా ఈ పదవిని ఆశిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
అధిష్టానం వద్ద లాబీయింగ్
కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడి ఎంపికలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నిర్ణయం కీలకం కానుంది. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో, జిల్లాలో పార్టీని బలోపేతం చేయగలిగే సమర్థవంతమైన నాయకుడిని ఎంపిక చేయాలని అధిష్టానం భావిస్తోంది. పోటాపోటీ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో, ఆశావహులు తమకు పదవి దక్కించుకునేందుకు టీపీసీసీ మరియు ఏఐసీసీ పెద్దల వద్ద గట్టిగా లాబీయింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఉత్కంఠలో కార్యకర్తలు
ఇంత పెద్ద సంఖ్యలో దరఖాస్తులు రావడం, కీలక నేతల మధ్య తీవ్ర పోటీ నెలకొనడంతో.. డీసీసీ అధ్యక్ష పదవి ఎవరికి దక్కుతుందన్న దానిపై పార్టీ కార్యకర్తల్లో, జిల్లా రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. కరీంనగర్లో కాంగ్రెస్ రాజకీయం ఒక్కసారిగా ‘హీట్’ ఎక్కడంతో, అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
పదవి ఎవరికి?
దరఖాస్తులు, ఆశావహుల వివరాలను పరిశీలకులు ఇప్పటికే టీపీసీసీ, ఏఐసీసీకి అందజేసినట్లు సమాచారం. అన్ని సమీకరణాలను లెక్కించి, జిల్లాలో కాంగ్రెస్ పార్టీని సమర్థవంతంగా నడిపించగలిగే నేతకు డీసీసీ అధ్యక్ష పీఠం దక్కే అవకాశం ఉంది. ఈ నియామకాలు నెలాఖరులోగా జరగవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.


