Thursday, November 13, 2025

రహస్యంగా టపాసుల దుకాణాల టెండర్లు..

కరీంనగర్ అంబేద్కర్ స్టేడియం బాధ్యతలు ఒకే వ్యక్తికి..
టెండర్లు నిర్వహించకుండానే అప్పజెప్పిన వైనం..
నిబంధనలు తుంగలో తొక్కి డబ్బులు వసూలు..

కరీంనగర్, నిఘా న్యూస్:దీపావళి సందర్భంగా బాణసంచా మోత మోగుతుంది. ఈ పర్వదినం రోజున లక్ష్మీ పూజలు నిర్వహించిన తర్వాత ఇళ్లలోనూ.. వ్యాపార సంస్థల సముదాయంలోనూ టపాసులు పేలుస్తుంటారు. దీపావళి రోజున టపాసులు పేల్చడం వల్ల శుభ సూచకమని.. దుష్టశక్తులు రాకుండా ఉంటాయని భావిస్తారు. ఈ సందర్భంగా బాణసంచా కొనుగోలు విపరీతంగా ఉంటాయి. కోట్ల రూపాయల్లో వ్యాపారం సాగుతూఉంటుంది. వినియోగదారుల డిమాండ్ మేరకు ఆయా పట్టణాల్లో, నగరాల్లో టపాసుల దుకాణాలను అందుబాటులో ఉంచుతారు. కరీంనగర్లో ఈ దీపావళి సందర్భంగా కోట్ల రూపాయల వ్యాపారం జరిగే అవకాశం ఉంది. అయితే దీపావళి సందర్భంగా ఒక్కో ప్రదేశంలో టపాసుల దుకాణాల సముదాయాన్ని ఏర్పాటు చేయడానికి కొందరికి బాధ్యతను అప్పగిస్తారు. నిబంధన ప్రకారం టెండర్లను నిర్వహించి.. అర్హులైన వారికి ఈ అవకాశం ఇస్తారు. కానీ కరీంనగర్లోని అంబేద్కర్ స్టేడియంలో అవేమి పాటించకుండా సీక్రెట్ గా ఒకరి చేతికే దుకాణాల సముదాయాన్ని అప్పగించి మిగతా వారికి అన్యాయం చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కరీంనగర్ లో పలుచోట్ల టపాసుల దుకాణాలు ఏర్పాటు చేశారు. వీటిలో మార్క్ఫెడ్ గ్రౌండ్లో, సర్కస్ గ్రౌండ్ తో పాటు అంబేద్కర్ స్టేడియంలో పటాకాల దుకాణాలు ఏర్పాటు చేశారు. అయితే నిబంధనల ప్రకారం వీటిని ఏర్పాటు చేయడానికి ముందే కొందరు గ్రూపుగా ఏర్పడి లేదా ఒకరికి టెండర్ల ద్వారా బాధ్యతలను అప్పగిస్తారు. ఇలా నిర్వహించే ముందు మున్సిపల్ లేదా కార్పొరేషన్ పరిధిలో ఉన్న స్థలాలను గుర్తిస్తారు. ఆ స్థలాల్లో టపాసుల దుకాణాలు ఏర్పాటు చేస్తున్నట్లు టెండర్లను ఆహ్వానిస్తారు. ఈ విషయాన్ని పత్రిక ప్రకటన లేదా కార్పొరేషన్ కార్యాలయంలో నోటీసుల ద్వారా తెలుపుతారు. ఇందులో భాగంగా దుకాణాల సముదాయాన్ని నిర్వహించడానికి దరఖాస్తులు చేసుకుంటారు. వీరిలో నిబంధనలు పాటించి అర్హులైన వారికి స్టాల్స్ నిర్వహణ బాధ్యతను అప్పగిస్తారు. వీరు మళ్లీ ఒక్కొక్కరికి స్టాల్స్ ను కేటాయిస్తూ వస్తుంటారు.

కానీ కరీంనగర్లోని అంబేద్కర్ స్టేడియంలో ఒకే వ్యక్తికి రహస్యంగా స్టాల్స్ నిర్వహణ బాధ్యతను అప్పగించినట్లు తెలుస్తోంది. అంబేద్కర్ స్టేడియానికి చెందిన కొందరు స్టాల్స్ నిర్వహణ విషయాన్ని బయటకు చెప్పకుండానే ఆ వ్యక్తికి అప్పగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే సదరు వ్యక్తి ఒక్కో స్టాల్ ఇతరులకు అప్పగించే విషయంలో ఒక్కొక్కరి దగ్గర నుంచి ముందే డబ్బులు వసూలు చేసినట్లు సమాచారం. నిబంధనలు ప్రకారం ఒక్కో స్టాల్ నిర్వహణకు ఇతరుల వద్ద నుంచి రూ. నాలుగు నుంచి 6 వేల రూపాయల తీసుకోవాలి. కానీ ఆ వ్యక్తి అంతకుముందే పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుని తమకు కావాల్సిన వారికే స్టాల్స్ ను అప్పగించినట్లు తెలుస్తోంది. దీంతో కొందరు ఇక్కడ టెండర్లు వేసి స్టాల్స్ సముదాయాన్ని దక్కించుకోవాలని ఉత్సాహం చూసిన వారికి నిరాశ ఎదురయింది.

అంతేకాకుండా మొత్తం స్టాల్స్ నిర్వహించే ఆ వ్యక్తికి ఫోన్ చేయగా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నట్లు కొందరు వ్యాపారులు తెలుపుతున్నారు. అధికారులు ఆ వ్యక్తికే మొత్తం స్టాల్స్ నిర్వహణ బాధ్యత అప్పగించడానికి కారణం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు.

ఇవే కాకుండా టపాసుల దుకాణాలు ఏర్పాటు చేయడానికి కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. నిర్ణీత ప్రదేశంలో.. ప్రజలకు దూరంగా బాణసంచా దుకాణాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కానీ అంబేద్కర్ స్టేడియం బాధ్యత తీసుకున్న వ్యక్తి ఎలాంటి నిబంధనలు పాటించకుండానే స్టాల్స్ ఇతరులకు అప్పగించినట్లు తెలుస్తోంది.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular