కరీంనగర్, నిఘా న్యూస్: కరీంనగర్ కు చెందిన తెలుగు యువ ఇంజినీర్ హనుష దురిసేటి మరో అంతర్జాతీయ గుర్తింపు సాధించారు. సొసైటీ ఆఫ్ ఉమెన్ ఇంజినీర్స్ (SWE) సంస్థ నుంచి ఆమెకు “రైజింగ్ టెక్నికల్ కాంట్రిబ్యూటర్ అవార్డు” లభించింది. ఈ అవార్డు ప్రపంచవ్యాప్తంగా 85 దేశాల్లో ఉన్న మహిళా ఇంజినీర్లలో ప్రారంభ దశలోనే విశేష సాంకేతిక కృషి చేసిన వారికి ఇస్తారు.
ప్రస్తుతం హనుష Iron Mountain సంస్థలో ప్రొడక్ట్ మేనేజర్గా పనిచేస్తున్నారు. ఆమె రూపొందిస్తున్న AI ఆధారిత సాంకేతిక పరిష్కారాలు ఎనర్జీ రంగంలో డేటా మేనేజ్‌మెంట్‌ను మరింత సమర్థవంతంగా మారుస్తున్నాయి. భూసంపద, కాంట్రాక్ట్‌లు, సబ్‌సర్ఫేస్ డేటా వంటి క్లిష్టమైన సమాచారం నుంచి విలువైన విశ్లేషణలు తీసుకురావడమే ఆమె ప్రధాన లక్ష్యం.
విద్యలో ప్రతిభ:
హనుష CBITలో కెమికల్ ఇంజినీరింగ్‌లో గోల్డ్ మెడల్ సాధించారు. అలాగే ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ ఇంజినీర్స్ (IIChE) నుండి పద్మశ్రీ బి.వి. రాజు బెస్ట్ స్టూడెంట్ అవార్డు అందుకున్నారు.తరువాత జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్ చేశారు. అక్కడ HopStart Entrepreneurship Competitionలో 50 బృందాల్లో మొదటి స్థానంలో నిలిచి, సాంకేతికతతో హౌసింగ్ సమస్యలకు పరిష్కారం చూపే ప్రాజెక్ట్ రూపొందించారు. ఆపై ఇజ్రాయెల్‌లో జరిగిన Technion Medical Hackathonలో రెండో స్థానం సాధించారు.
హాకథాన్ జడ్జ్‌గా సేవలు:
హనుష గారు అమెరికాలోని ప్రముఖ విశ్వవిద్యాలయాల హాకథాన్‌లలో జడ్జ్‌గా కూడా సేవలందిస్తున్నారు. వీటిలో హార్వర్డ్ (HackHarvard), యేల్ (YHacks), యూ.సీ. బర్క్లీ (CalHacks), జార్జియా టెక్ (AI-ATL), యూనివర్సిటీ ఆఫ్ ఆస్టిన్ వంటి సంస్థలు ఉన్నాయి. యువ ఆవిష్కర్తలకు మార్గదర్శకత్వం అందిస్తూ, కొత్త ఆలోచనలను ప్రోత్సహిస్తున్నారు.
AI ఆధారిత సాంకేతిక పరిష్కారాలు:
హనుష రూపొందించిన AI ఏజెంట్లు కంపెనీలకు వేలాది లీజు ఒప్పందాలు, భూమి పత్రాలు, చట్టపరమైన డాక్యుమెంట్లను సులభంగా చదివి విశ్లేషించే సామర్థ్యాన్ని ఇస్తాయి. ఈ ఏజెంట్లు చెల్లింపులు, రిన్యూల్ తేదీలు, రిస్క్ ఫ్యాక్టర్లు వంటి అంశాలను గుర్తించి సమయానికి సూచిస్తాయి. దీంతో సమయం, వ్యయం రెండూ తగ్గుతాయి.
సాంకేతికతతో సమాజ సేవ లక్ష్యం:
“ఈ అవార్డు నాకు కొత్త ఉత్సాహం ఇచ్చింది. AI ఆధారిత ఇన్నోవేషన్ ద్వారా పరిశ్రమలతో పాటు సమాజానికి కూడా ఉపయోగపడే పరిష్కారాలను అందించాలనేది నా లక్ష్యం,” అని హనుష దురిసేటి తెలిపారు. హనూష తండ్రి దురిసేటి రఘు చందర్ జగిత్యాల డిఎస్పీ.తెలుగు యువ ఇంజినీర్ హనుష దురిశెట్టికి అంతర్జాతీయ గౌరవం


