వేములవాడ జనవరి 16 (నిఘా న్యూస్) :వేములవాడ పట్టణంతోపాటు రూరల్ మండలంలోని పలు గ్రామాలలో నిబంధనలకు విరుద్ధంగా క్లీనిక్ లను ఏర్పాటు చేసి ప్రజలకు వైద్యం చేస్తున్నారన్న కారణంతో జిల్లా వైద్య అధికారి రజిత ఆధ్వర్యంలో అధికారులు, సిబ్బంది గురువారం తనిఖీలు నిర్వహించారు
వేములవాడ పట్టణంలోని గాంధీ నగర్ లోని శ్రీ లక్ష్మీ ప్రసన్న ల్యాబ్, మహేష్ క్లినిక్, రవీందర్ క్లినిక్ లను, అలాగే వట్టెంలా గ్రామంలోని ఓ క్లినిక్ తో పాటు పలు గ్రామాలలో జిల్లా వైద్యాధికారి రజిత ఆధ్వర్యంలో సోదాలు నిర్వహించారు. వేములవాడ పట్టణంలో ఎమ్మార్వో మహేష్ తో పాటు స్థానిక పోలీసుల సహాయంతో గాంధీ నగర్ లో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న మూడు క్లినిక్ లను అధికారులు సీజ్ చేశారు. బుధవారం నాంపల్లి గ్రామంలోని ఓ క్లినిక్ ను కూడా నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేశారన్న కారణంతో సీజ్ చేశారు. అలాగే జిల్లా వ్యాప్తంగా కూడా పలు గ్రామాలలో ఆర్ఎంపి క్లినిక్లను అధికారులు తనిఖీ చేస్తున్నారు. ఆర్ఎంపీలు అర్హత లేకుండా ఆస్పత్రి నిర్వహిస్తూ ప్రజలకు వైద్యం చేస్తున్నారని దీనివల్ల ప్రజలకు సరైన వైద్యం అందడం లేదని అధికారులు తెలిపారు. అర్హత లేకుండా క్లినిక్లను నిర్వహిస్తే సీజ్ చేస్తామని హెచ్చరించారు. కాగా జిల్లా వ్యాప్తంగా ఆర్ఎంపీల క్లినిక్ లా పై దాడులు జరగడంతో గ్రామాలలో వైద్య సేవలు అందిస్తున్న ఆర్ఎంపీలు అయోమయానికి గురవుతున్నారు.


