Thursday, November 13, 2025

అనుమతి లేకుండా యథేచ్ఛగా టపాసుల విక్రయం..

లైసెన్స్ రెన్యూవల్ చేయని విక్రయదారులు
పట్టించుకోని అధికారులు..

కరీంనగర్, నిఘా న్యూస్:దీపావళి రాగానే బాణసంచా కాల్చాలన్న సంబరం పిల్లల్లో ఉంటుంది. దీంతో రెండు రోజుల ముందు నుంచే బాణసంచా కొనుగోలు చేయాలని మారం చేస్తూ ఉంటారు. అయితే బాణసంచా విక్రయదారులు సైతం దీపావళి పండుగకు రెండు మూడు రోజుల ముందు నుంచే ఏర్పాటు చేస్తారు. ఇందులో భాగంగా కరీంనగర్ లో చాలా ప్రాంతాల్లో టపాసుల విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో అంబేద్కర్ స్టేడియం తో పాటు సర్కస్ గ్రౌండ్, మార్క్ ఫెడ్ గ్రౌండ్లలో టపాసులు విక్రయిస్తున్నారు. అలాగే మానకొండూర్ తదితర ప్రాంతాల్లో ప్రత్యేక దుకాణాలు ఏర్పాటు చేసి టపాసులు అమ్ముతున్నారు. అయితే ప్రమాదకరమైన వీటిని విక్రయించాలంటే ముందుగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. లేదా గతంలో తీసుకున్న లైసెన్సును రెన్యువల్ చేయాల్సి ఉంటుంది. కానీ కొందరు అలా చేయకుండా పాత లైసెన్సు పైనే దుకాణాలు ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది.

సాధారణంగా టపాసుల దుకాణం ఏర్పాటు చేయడానికి అగ్నిమాపక, పోలీసు, స్థానిక మున్సిపల్/బల్దియా అధికారుల నుండి అనుమతి తీసుకోవాలి. తాత్కాలిక దుకాణాలకు కూడా ఈ అనుమతులు తప్పనిసరి. దుకాణాలు జనావాసాలకు దూరంగా, రద్దీ ప్రదేశాలకు దూరంగా, పెట్రోల్ బంకులు లేదా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లకు సమీపంలో కాకుండా ఏర్పాటు చేయాలి. టపాసుల దుకాణం ఏర్పాటు చేయడానికి అగ్నిమాపక శాఖ నుండి అనుమతి తప్పనిసరి. ప్రజల భద్రత కోసం పోలీసుల నుండి అనుమతి అవసరం.

అయితే కరీంనగర్ లో ఏర్పాటు చేసిన కొన్ని టపాసుల దుకాణాలకు అనుమతి లేవన్న విషయం తెలుస్తుంది. అంతేకాకుండా కొందరు గతంలో తీసుకున్న లైసెన్స్ పైనే తిరిగి దుకాణాలు ఏర్పాటు చేసినట్లు సమాచారం. గతంలో లైసెన్స్ తీసుకుంటే దానిని రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ అలా అదనపు డబ్బులు చెల్లించాల్సి వస్తుందని పాత లైసెన్స్ పైనే దుకాణాలు ఏర్పాటు చేసుకున్నారు.

అధికారులు ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోవడంలేదని తెలుస్తోంది. దుకాణం ఏర్పాటు చేసిన ప్రతి విక్రయదారుడు వద్ద లైసెన్స్ తప్పనిసరిగా చెక్ చేయాల్సి ఉంటుంది. కానీ కొందరు లైసెన్స్ లేకుండానే దర్జాగా అమ్ముతున్నట్లు సమాచారం. అయితే అధికారులు వారిని పట్టించుకోకపోవడానికి కారణం ఏంటని కొందరు ప్రశ్నిస్తున్నారు.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular