బిజెపి రాష్ట్ర అధ్యక్ష పదవి పై వీడని ఉత్కంఠ
- గతంలోనూ ఈటెల రాజేందర్ పేరు ఖరార్!
- కరీంనగర్, నిఘా న్యూస్: బీఆర్ఎస్ పార్టీని వీడి బిజెపిలో చేరిన ఈటెల రాజేందర్ ఆ పార్టీలో కీలక నాయకుడిగా మారాడు. తెలంగాణలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి సైతం తాను అర్హుడనని నిరూపించుకున్నాడు. ఇటీవల జరిగిన ఎంపీ ఎన్నికల్లో మల్కాజ్గిరి నుంచి పోటీ చేసి విజయం సాధించాడు. అప్పటినుండి ఆ పార్టీలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాడు. అయితే ప్రస్తుతం తెలంగాణ బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా ఎవరు అనే చర్చ మొదలు కాగా అందులో ఈటెల రాజేందర్ పేరు కీలకంగా వినిపించింది. అయితే ఈటెల రాజేందర్ సైతం గతంలో అధిష్టానాన్ని కలిసి తనకు రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వాలని కోరినట్లు సమాచారం. కేంద్ర అధిష్టానం సైతం తనకు రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చేందుకు సుముఖత చూపుందని, అయితే తెలంగాణ రాష్ట్రంలోని కీలకంగా వ్యవహరించే ముగ్గురు నాయకులు ఈటెల రాజేందర్ కు ఆ పదవి రాకుండా అడ్డుకున్నట్లు చర్చ సాగుతోంది. ప్రజల్లో మంచి సానుకూలత ఉన్న ఈటెల రాజేందర్ కు ఆ పదవి ఇవ్వడం వల్ల బిజెపికి మంచి భవిష్యత్తు ఉంటుందని ఆ పార్టీలో ఒక వర్గం పేర్కొంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో బిజెపి రాష్ట్ర అధ్యక్షునిగా ఈటెల రాజేందర్ పేరు ఖరారు చేస్తే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పుంజుకుని అధికారాన్ని దక్కించుకుంటుందని ఆ పార్టీలో కొందరు నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే కొందరు నాయకులు తనకు రాష్ట్ర అధ్యక్షుని పదవి రాకుండా అడ్డుకుంటున్నారని ఈటెల రాజేందర్ సైతం తన సన్నిహితుల దగ్గర వాపోయినట్లు సమాచారం. ఏదేమైనాప్పటికీ బీజేపీ అధిష్టానం రాష్ట్ర అధ్యక్ష పదవి ఎవరికి ఇస్తుందో వేచి చూడాల్సిందే..


