హైదరాబాద్,నిఘా న్యూస్ :మా ఫోన్ నెంబర్లు మీకెందుకు… మా ఆదాయం, ఆస్తులు మీరేం చేసుకుంటారు? అంటూ కులగణన సర్వేకు వెళ్లిన ఎన్యుమరేటర్లను ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇంటికి వెళ్తిన సిబ్బంది ముఖం మీదే తలుపులు మూసేస్తున్నారు. మరికొన్ని చోట్ల పెంపుడు కుక్కలను వదిలి ఇంట్లోకి రాకుండా అడ్డుకుంటున్నారు? ప్రజల జీవితాల్లో మార్పులకు ఈ సర్వే చేస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది.
అయితే ఈ సర్వేలో ప్రజల వ్యక్తిగత సమాచారం తీసుకొని ఏం చేస్తారని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. కుల గణన సర్వే ఎందుకు? 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్‌ను కాంగ్రెస్ ప్రకటించింది. బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చింది.
అంతకుముందు 2018 ఎన్నికల్లో కులగణన చేస్తామని కూడా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. దీంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం సామాజిక, ఆర్ధిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే పేరుతో కులగణనను నవంబర్ 6 నుంచి చేపట్టింది. 26 రోజుల పాటు ఈ సర్వే సాగుతోంది.
బీసీల జనాభా ఎంత ఉందనే విషయమై సమాచారం కోసం ఈ సర్వే చేస్తున్నామని చెబుతు న్నారు. కానీ, సర్వేలో ఉన్న ప్రశ్నావళిలో ఇతర ప్రశ్నలు కూడా ఉన్నాయి. ఇక్కడే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తోంది.
సర్వే ఎలా చేస్తారు? ఈ సర్వేలో 56 ప్రధాన ప్రశ్నలు ఉన్నాయి. మరో 19 అనుబంధ ప్రశ్నలున్నాయి. అంటే ప్రజలు మొత్తం 75 ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి. పార్ట్-1 , పార్ట్ -2 క్వశ్చన్లుంటాయి. ఎనిమిది పేజీల్లో సమాచారాన్ని సేకరిస్తారు.
పార్ట్ -1 లో కుటుంబ యజమాని, సభ్యుల వ్యక్తిగత వివరాలకు సంబంధించిన 60 ప్రశ్నలుంటాయి. రెండో పార్ట్ లో ఆస్తులు, అప్పులకు సంబంధించిన సమాచారం అడుగుతున్నారు.
సమగ్ర సర్వేకు వచ్చే సిబ్బంది ఆధార్ సహా ఇతర సర్టిఫికెట్లను తీసుకోవద్దు. కులం, విద్యార్హత, వృత్తి, వార్షిక ఆదాయం, ఇంటి విస్తీర్ణం, ఇతర వివరాలను సర్వే సిబ్బంది కుటుంబ యజమాని చెప్పాలి. ప్రశ్నావళిలో ఇలాంటి ప్రశ్నలకు జవాబులు చెప్పేందుకు జనం నిరాకరిస్తున్నారు


