కలెక్టర్‌కు మత్స్యకారులు, ఆయకట్టు రైతుల వినతి
కరీంనగర్, నిఘా న్యూస్: రాగంపేట రేవెల్లి చెరువులో ఏర్పాటు చేసిన మోటర్లను తొలగించి, చెరువు నీటిని పరిరక్షించాలని కోరుతూ మత్స్య పారిశ్రామిక సంఘం సభ్యులు, ఆయకట్టు రైతులు జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. చెరువుపై ఆధారపడి సుమారు 560 కుటుంబాలు చేపల వృత్తి, వ్యవసాయంపై జీవనం సాగిస్తున్నాయని, చెరువులో నీటి నిల్వ తగ్గిపోవడంతో తమ జీవనోపాధి దెబ్బతింటోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
దేశాయిపేట గ్రామానికి చెందిన కొందరు రైతులు చెరువుపై సుమారు 30 మోటర్లు ఏర్పాటు చేసి పైపులైన్ల ద్వారా నీటిని వినియోగిస్తున్నారని వారు ఆరోపించారు. ఈ విషయంపై ఇప్పటికే ఇరిగేషన్, విద్యుత్ శాఖ అధికారులతో పాటు తహసీల్దార్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. చెరువులో ఏర్పాటు చేసిన మోటర్లను తొలగించాలని కోరుతూ సంబంధిత అధికారులను కలిసి సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేసినట్లు పేర్కొన్నారు.
ఈ సమస్యపై సమావేశం నిర్వహించి సంబంధిత అధికారుల సమక్షంలో చర్చించినట్లు మత్స్యకారులు తెలిపారు. సమావేశంలో చెరువులో ఎట్టి పరిస్థితుల్లోనూ మోటర్లు ఏర్పాటు చేయరాదని, ఇప్పటికే ఉన్న మోటర్లను తొలగించాలని ఇరిగేషన్ అధికారులు సూచించినట్లు చెప్పారు. ఈ మేరకు విద్యుత్ శాఖకు కూడా ఇరిగేషన్ అధికారులు లేఖ ఇచ్చినప్పటికీ, ఇప్పటివరకు మోటర్లకు సంబంధించిన విద్యుత్ కనెక్షన్లు లేదా అనుమతులపై తగిన చర్యలు తీసుకోలేదని వారు ఆరోపించారు.
చెరువులో నీటి నిల్వ తగినంతగా లేకపోవడంతో చేపల పెంపకం కూడా తీవ్రంగా దెబ్బతింటోందని మత్స్యకారులు తెలిపారు. తాము సొంతంగా డబ్బులు వెచ్చించి చేప పిల్లలను కొనుగోలు చేసి చెరువులో వదిలామని, ప్రస్తుతం నీరు లేక చేపల ఎదుగుదల సరిగా జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చెరువులోని నీటిని మోటర్ల ద్వారా తరలిస్తే చేపల పెంపకంతో పాటు ఆయకట్టు రైతుల వ్యవసాయానికి కూడా తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.
రాగంపేట రేవెల్లి చెరువుపై ఆధారపడి జీవిస్తున్న మత్స్యకారులు, మత్స్య కార్మికులు, ఆయకట్టు రైతుల జీవనోపాధిని దృష్టిలో ఉంచుకుని చెరువులో ఏర్పాటు చేసిన మోటర్లను వెంటనే తొలగించేలా చర్యలు తీసుకోవాలని వారు జిల్లా కలెక్టర్‌ను కోరారు. చెరువు నీటిని పరిరక్షించి, మత్స్యకారులు, ఆయకట్టు రైతులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ వినతిపత్రంలో మత్స్య పారిశ్రామిక సంఘం సభ్యులు రామయ్య, తిరుపతి, లచ్చయ్య, భూమయ్య, శంకర్, అంజయ్య, శ్రీనివాస్, ఎస్ మల్లేశ్, నర్సయ్య, లచ్చయ్య, చంద్రయ్య ఉన్నారు.


