Sunday, August 30, 2026

కలెక్టర్ కార్యాలయం కోసం ఎదురుచూపులు..

ఏళ్లు గడుస్తున్నా పూర్తికాని పనులు..

స్వాతంత్ర్య దినోత్సవానికి ప్రారంభం వాయిదా..

ప్రజలకు తప్పని తిప్పలు

కరీంనగర్ టౌన్, నిఘా న్యూస్ : కరీంనగర్ జిల్లా కేంద్రంలో అత్యాధునిక హంగులతో నిర్మిస్తున్న నూతన సమీకృత జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల సముదాయం పనులు నత్తనడకన సాగుతున్నాయి. నిర్మాణ పనులు ప్రారంభమై ఏళ్లు గడుస్తున్నా భవనం ఇంకా ప్రారంభోత్సవానికి నోచుకోకపోవడంపై జిల్లా ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టు జాప్యానికి గురవుతుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.స్వాతంత్ర్య దినోత్సవాన ప్రారంభిస్తారని ప్రచారంనూతన కలెక్టరేట్ భవనాన్ని ఈ నెల 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రారంభించనున్నట్లు కొంతకాలంగా ప్రచారం జరిగింది. అయితే పనులు పూర్తికాకపోవడంతో ఆ అవకాశం కూడా లేకుండా పోయింది. భవన నిర్మాణం దాదాపు చివరి దశకు చేరుకున్నప్పటికీ కీలకమైన అనేక పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.

ఇంటీరియర్.. విద్యుత్ పనులు అసంపూర్తి

ప్రస్తుతం భవనంలో ఇంటీరియర్ పనులు, విద్యుత్‌ సంబంధిత పనులు పూర్తికావాల్సి ఉంది. అదేవిధంగా కార్యాలయ ప్రాంగణానికి సంబంధించిన రోడ్ల నిర్మాణం, పార్కింగ్ ఏర్పాట్లు తదితర పనులు కూడా మిగిలే ఉన్నాయి. దీంతో పూర్తిస్థాయిలో కార్యాలయాలను కొత్త భవనంలోకి తరలించే పరిస్థితి కనిపించడం లేదు.ఆఫీసుల కోసం ప్రజల పరుగులుప్రస్తుతం జిల్లా స్థాయి ప్రభుత్వ శాఖల కార్యాలయాలు పట్టణంలోని వేర్వేరు ప్రాంతాల్లో కొనసాగుతున్నాయి. దీంతో వివిధ ప్రభుత్వ పనుల కోసం కలెక్టరేట్‌కు వచ్చే ప్రజలు, రైతులు ఒక కార్యాలయం నుంచి మరో కార్యాలయానికి కిలోమీటర్ల మేర తిరగాల్సి వస్తోంది. అన్ని శాఖలు ఒకే చోట అందుబాటులోకి వస్తే ప్రజలకు సమయం, ప్రయాణ ఖర్చులు ఆదా అవుతాయని పలువురు పేర్కొంటున్నారు.

నిధుల కొరతే కారణమా?

కలెక్టరేట్ పనుల జాప్యానికి బిల్లుల చెల్లింపులో ఆలస్యం, నిధుల కొరత కారణమనే చర్చ జరుగుతోంది. అయితే దీనిపై అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది. పనులు నిర్ణీత గడువులో పూర్తికాకపోవడంతో నిర్మాణ వ్యయం మరింత పెరిగే అవకాశం ఉందనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.

తాత్కాలిక భవనాలకు భారీ అద్దెలు?

జిల్లా స్థాయి కార్యాలయాలు ప్రస్తుతం వేర్వేరు భవనాల్లో కొనసాగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ప్రతి నెలా భారీ మొత్తంలో అద్దెలు చెల్లిస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. నూతన సమీకృత కలెక్టరేట్ అందుబాటులోకి వస్తే ఈ అదనపు వ్యయాన్ని తగ్గించే అవకాశం ఉంటుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

ఇప్పటికైనా సంబంధిత అధికారులు కలెక్టరేట్ నిర్మాణ పనులపై ప్రత్యేక దృష్టి సారించి మిగిలిన పనులను వేగంగా పూర్తి చేయాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. అన్ని శాఖలను ఒకే చోటకు తీసుకువచ్చి ప్రజలకు మెరుగైన పరిపాలనా సేవలు అందించేందుకు నూతన సమీకృత కలెక్టరేట్‌ను సాధ్యమైనంత త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular