-యువజన కాంగ్రెస్ తో ప్రారంభం
-అన్ని పార్టీల్లోనూ అదే వాతావరణం
కరీంనగర్ టౌన్, నిఘాన్యూస్: కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీఫారాల జారీతో రాజీనామాల పర్వం ప్రారంభమైంది. అందులోనూ అధికార పార్టీకి చెందిన యువజన కాంగ్రెస్ నేత ముందుగా రాజీనామా సమర్పించారు. అనేక మంది అదే దారిలో పయనించేందుకు సిద్ధమైనారు, ఈ విధానం అన్ని పార్టీల్లోనూ కొనసాగే అవకాశం ఉంది.
జిల్లాలోని కరీంనగర్ కార్పొరేషన్ తో పాటు చొప్పదండి. హుజురాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీలకు ఎన్నికల జరుగుతున్న విషయం తెలిసిందే. పాలకవర్గాల పదవీ కాలం ముగిసి ఏడాది గడిచిన అనంతరం ఎన్నికలు వచ్చాయి. ఈ క్రమంలో ఆయా పార్టీల్లో టికెట్ల కోసం పోటీ పెరిగింది. అందులోనూ కరీంనగర్ కార్పొరేషన్లలో ఈ పోటీ తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. ఓటర్ల జాబితా ప్రకటన మొదలు ఆశావహులు వారు నమ్ముకున్న నాయకుల చుట్టూ ప్రదక్షణలు ప్రారంభించారు. టికెట్టు ఖాయంగా హామీలు తీసుకున్నారు. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ రావడంతో టికెట్ల కోసం ప్రయత్నాలు తీవ్రమైనాయి. నామినేషన్లు వేసే రోజు రానేవచ్చింది. కాంగ్రెస్ లో నాయకులు, ఆశవహులు సంఖ్య కూడా ఎక్కువగానే ఉండడంతో ఎటూ తేల్చుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలోనే సమన్వయం కోసం మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావును ఇంచార్జీగా నియమించారు, ఆయన జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు పార్టీ నాయకులు, కార్యకర్తలతో భారీ సమావేశం నిర్వహించారు. ఎటూ
తేల్చే పరిస్థితిలేక టికెట్ల విషయం వాయిదా వేశారు. నామినేషన్ల పర్వం ముగిసినప్పటికీ టికెట్ల విషయం తేలలేదు. సుమారుగా అన్ని ప్రధాన పార్టీల్లోనూ అదే పరిస్థితి నెలకొంది. అందువల్ల ఎవరివారే ఆశావహులంతా భారీ ఎత్తున నామినేషన్లు దాఖలు చేశారు. పార్టీల ఫిరాయింపు, రెబల్ అభ్యర్థులుగా ఉండే అవకాశాల నేపథ్యంలో చివరి రోజు మంగళవారం నాడే బీఫారాలు అందించాలని అధిష్టానాలు నిర్ణయించుకున్నాయి. అయిన్నప్పటికీ పెరిగిన ఒత్తిడి నేపథ్యంలో కొందరికి జారీ చేశారు. దాని ప్రభావం వెంటనే ప్రారంభమైంది. 45వ డివిజన్లో తనను విస్మరించారని జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మహ్మద్ అజిమ్ తన పదవికి రాజీనామా చేశారు. అందులోనూ ధైర్యంఉంటే నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు తన రాజీనామాను ఆమోదించాలని సవాల్ విసిరారు. పార్టీ నగర అధ్యక్షుడు అంజన్ కుమార్ సైతం విస్మరించారని విమర్శించారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనూ పార్టీని వీడని వారిని వదిలేసి కొత్తగా చేరిన వారికి టికెట్లు ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు. కష్టపడిన వారికి పార్టీలో గుర్తింపు లేకుండా పోయిందన్నారు. ఇదే రీతిలో పలు డివిజన్లలో ఆశావహులు పెదవి విరుస్తున్నారు. ఈ పరిస్థితులు కేవలం కాంగ్రెస్కే పరిమితం కాలేదు. ప్రధాన పార్టీలైన బీజేపీ, బీఆర్ఎస్ లో నూ ఉన్నాయి, కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇక్కడి నుంచే ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. అదే విధంగా కరీంనగర్ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్కు చెందిన గంగుల కమలాకర్ ఉన్నారు. దీంతో మూడు పార్టీల్లోనూ బీఫారాల కోసం పోటీ తీవ్రంగానే ఉంది. మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకు నామినేషన్ల విరమణ సమయం ముగియనుంది. అందువల్ల అప్పటిలోగా అన్ని పార్టీల్లోనూ బీఫారాల సమర్పణ పూర్తి అవుతుంది. దీంతో అసమ్మత్తులు పెల్లుబికే అవకాశాలు ఉన్నాయి.


