-పాలలేక విషమా
-కరీంనగర్ లో కల్తీ పాలు దందా
కరీంనగర్, నిఘా న్యూస్: మనకు పొద్దున పాలు లేనిదే తెల్లవారదు. పెద్దలకు చాయ్ దగ్గరి నుంచి పిల్లలకు ఓ గ్లాసుడు పాల దాకా అత్యవసరం. కానీ డెయిరీ నిర్వాహకుల నిర్లక్ష్యం, కక్కుర్తి కారణంగా ఇప్పుడా పాలే ప్రాణాంతకంగా పరిణమిస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ వరంగల్ కరీంనగర్ లాంటి నగరంలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఇక్కడ విక్రయమవుతున్న వాటిలో దాదాపు 45 శాతం పాలు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండడం లేదనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విక్రయిస్తున్న పలు బ్రాండ్ల పాల ప్యాకెట్లను ఇటీవల ఒక బృందం సేకరించి నాచారంలో ఉన్న రాష్ట్ర ఆహార పరీక్షా కేంద్రం (స్టేట్ ఫుడ్ లేబొరేటరీ)లో పరీక్షలు చేయించింది. అందులో కొన్ని ఆందోళనకర అంశాలు వెలుగుచూశాయి. కొన్ని శాంపిళ్ల పాలలో కొవ్వు వంటి పదార్థాలు నిబంధనల మేరకు లేవని ప్రమాదకరమైన ఇ–కోలీ, సాల్మోనెల్లా బ్యాక్టీరియా వంటి వాటి ఆనవాళ్లు ఉన్నాయని తేలింది. అంతేకాదు యూరియా, గ్లూకోజ్, హైడ్రోజన్ పెరాక్సైడ్, సోడా వంటివి కూడా స్వల్ప మోతాదుల్లో ఉన్నట్లు వెల్లడైంది.కరీంనగర్ నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి ప్యాకెట్ పాల నాణ్యతపై మహిళల అభిప్రాయాలు సేకరించింది. ఈ సందర్భంగా చాలా మంది మహిళలు చెబుతున్నది ఒకటే ప్యాకెట్ పాలు జిగటగా ఉంటున్నాయని.. మరగబెట్టినప్పుడు అదోరకమైన వాసన వస్తోందని.సరిగా తోడుకోవడం లేదని. తోడుకున్నా బంకలాగా అతుక్కుంటోందని వాపోతున్నారు.
– పాలు అధిక సమయం నిల్వ ఉండేందుకు సోడా, హైడ్రోజన్ పెరాక్సైడ్‌లను ఎక్కువ మోతాదులో కలుపుతున్నారు. వీటివల్ల మెదడు, నరాలు దెబ్బతింటాయని, జీర్ణకోశ సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక యూరియా కారణంగా కళ్లు, మెదడుకు హానికరమని స్పష్టం చేస్తున్నారు.
– ఇ–కోలీ కారణంగా జీర్ణకోశ వ్యాధులు, సాల్మొనెల్లా బ్యాక్టీరియా కారణంగా టైఫాయిడ్ వంటి సమస్యలు వస్తాయి.
-గేదెలకు విచ్చలవిడిగా ఆక్సిటోసిన్ ఇంజెక్షన్లు ఇస్తుండడంతో ఆ రసాయనం పాలలో చేరుతోంది. దీనివల్ల ఆ పాలు తాగిన పిల్లల్లో అసాధారణ పెరుగుదల, రోగనిరోధక శక్తి తగ్గడం వంటి సమస్యలు వస్తాయి.
– పలు డెయిరీల నిర్వాహకులు పాలు తయారు చేసేందుకు నాణ్యత లేని పాలపొడిని వినియోగిస్తున్నారు. అది కూడా అపరిశుభ్ర పరిసరాల్లో పాల తయారీ సాగుతోంది. దీని వల్ల వివిధ రకాల వైరస్, బ్యాక్టీరియాలు సంక్రమించి రోగాల పాలు కావాల్సి వస్తుందని వైద్యులు చెబుతున్నారు.
అప్రమత్తంగా ఉండకపోతే రోగాలే..
‘‘కల్తీ పాలు తాగిన పిల్లలు ఎంట్రిక్ ఫీవర్, టైఫాయిడ్, డయేరియా, గ్యాస్ట్రో ఎంటిరైటిస్, కడుపునొప్పి, వాంతులు వంటి అనారోగ్య సమస్యల పాలు కావాల్సి వస్తుంది. ముఖ్యంగా ఇ–కోలీ బ్యాక్టీరియా వల్ల వాంతులు, డయేరియా, జిగట విరేచనలు, జీర్ణకోశ వ్యాధుల బారిన పడాల్సి వస్తుంది. సాల్మొనెల్లా బ్యాక్టీరియా వల్ల టైఫాయిడ్ వస్తుంది. పాలను 70 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే అధిక వేడి మీద కొంతసేపు మరిగించినపుడే బ్యాక్టీరియా చనిపోతుంది. ఇక పాలల్లో కల్తీ చేసే పదార్థాలతో ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అందువల్ల అప్రమత్తంగా ఉండాలి.


