కరీంనగర్(నిఘా న్యూస్):కరీంనగర్ కమీషనరేట్ వ్యాప్తంగా ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, ప్రజల భద్రత దృష్ట్యా తీసుకునే చర్యల్లో భాగంగా కరీంనగర్ ట్రాఫిక్ పోలీసులు వరుస స్పెషల్ డ్రైవ్ లు మరియు వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు.ఈ సందర్బంగా ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రమేష్ మాట్లాడుతూ శుక్రవారం నాడు కరీంనగర్ కమీషనరేట్ ట్రాఫిక్ పోలీసులు, విద్యార్థుల భద్రత దృష్ట్యా పిల్లలను స్కూళ్లకు చేరవేసే ప్రయివేటు బస్సులు, వాన్ లు , ఆటోలపై స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహించామన్నారు. డ్రైవర్లకు యొక్క డ్రైవింగ్ లైసెన్స్ తో పాటుగా,డ్రైవర్స్ చరిత్ర గతంలో ఏమైనా రోడ్డు ప్రమాదాలకు గురిచేసిన కేసులు ఉన్నాయా లేదా ఆరాదీశామన్నారు. వాహనాల ఫిట్ నెస్ సర్టిఫికెట్స్ , ఇతర ధ్రువపత్రాలు,పొల్యూషన్ మరియు ఇన్సూరెన్సులు తనిఖీ చేసారు.

స్కూల్ బస్సులు, వాన్ లు , ఆటోలు , టెంపో వాహనాలను నడుపుతున్న డ్రైవర్లకు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించామన్నారు. ఈ స్పెషల్ డ్రైవ్ నందు వివిధ స్కూళ్ళు మరియు కాలేజీలకు చెందిన 52 వాహనాలను తనిఖీ చేశామన్నారు. సరైన ధృవపత్రాలు లేని 18 వాహనాలను గుర్తించి వారికి ఈ చలాన్ ద్వారా జరిమానాలు విధించామన్నారు. ఈ తనిఖీల్లో చాలా వరకు స్కూళ్లకు చెందిన బస్సుల్లో చిన్న పిల్లల కోసమై కేర్ టేకర్ లు అందుబాటులో వుంచట్లేదని గుర్తించామన్నారు.ఆయా పాఠశాలలు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించామన్నారు. కరీంనగర్ కమీషనరేట్ వ్యాప్తంగా స్కూల్ బస్సులు , వాన్ లు నడిపే వ్యక్తులు డ్రైవింగ్ లైసెన్సు తో పాటుగా వాహనానికి సంబందించిన అన్నీ సరైన ధ్రువపత్రాలు కలిగివుండాలని, ట్రాఫిక్ నియమాలను పాటించాలని సూచించారు.
ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించినటువంటి వాహనదారులని గుర్తించడమే కాకుండా వారికి ఈ చలాన్ ద్వారా జరిమాన కూడా విధిస్తామన్నారు. కరీంనగర్ లో ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్ లు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు. వాహనదారులు ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ, ట్రాఫిక్ అంతరాయం కలగకుండా సహకరించాలని కోరారు. ట్రాఫిక్ నియమాలు పాటించకుండా పట్టుబడిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయన్నారు.ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రమేష్ తో పాటుగా సబ్ ఇన్స్పెక్టర్ ఇషాక్, ఇతర అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.