కరీంనగర్, నిఘా న్యూస్: తెలంగాణలోకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నామినేటెడ్ పోస్టులపై ఆశలు పెరిగాయి. ఎమ్మెల్యే, ఎంపీ ఎలక్షన్స్ పూర్తయిన తర్వాత నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తారని అందరూ ఆశతో ఎదురుచూస్తున్నారు. ఇదే సమయంలో జిల్లా అధ్యక్షుల కాలపరిమితి కూడా పూర్తి కావడంతో చాలామంది ఈ కుర్చీపై ఆశలు పెట్టుకున్నారు. కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కవ్వంపల్లి సత్యనారాయణ కొనసాగుతున్న తరుణంలో ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే డిసిసి హోదాలో ఆయన కాల పరిమితిని కూడా పూర్తి చేసుకున్నారు. దీంతో ఈ పదవిని మరొకరికి ఇచ్చే అవకాశం ఉందన్న ఊహ గానాలు వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో పలువురు పేర్లు వినిపిస్తున్నాయి. అయితే ఇటీవల వెలిచాల రాజేంద్ర రావు పేరు ప్రముఖంగా వెలుగులోకి వచ్చింది.
గత ఎన్నికల్లో వెలిచాల రాజేందర్ రావు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అయినా రాజేందర్ రావు మాత్రం కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్లమెంటు నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న ఆయన ఊరురా తిరుగుతూ ప్రజా సమస్యలను తెలుసుకుంటున్నారు. తండ్రి వెలచాల జగపతిరావు స్ఫూర్తితో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ తనదైన శైలిలో ఆకట్టుకుంటున్నారు.
కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం సరైన నాయకులు లేరని వాదన ఉంది. ఇప్పటివరకు ఉన్న అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జ్ పురుమల్ల శ్రీనివాస్ ను పార్టీ సస్పెండ్ చేసింది. దీంతో అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు పార్లమెంటు లెవల్లో వెలిచాల కాంగ్రెస్కు సంబంధించిన ప్రతి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కొన్ని ప్రత్యేక కార్యక్రమాలను తన భుజాన వేసుకొని ముందుకు వెళ్తున్నారు.
ఇలాంటి సమయంలో కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు వెలిచాల రాజేందర్ రావు చేతిలో పెడితే పార్టీ గాడిన పడే అవకాశం ఉందని కొందరు కాంగ్రెస్ నాయకులు అనుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఫామ్ లోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. కరీంనగర్ జిల్లాలో మాత్రం పుంజుకోవడం లేదు. అయితే ఇలాంటి సమయంలో వెలిచాలా రాజేందర్ రావు కు పార్టీ పగ్గాలు అప్పజెప్పితే వచ్చే స్థానిక ఎన్నికల్లో పార్టీ బలపడే అవకాశం ఉందని అంటున్నారు. ప్రస్తుతం డిసిసి అధ్యక్షుల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఆచి తూచి వ్యవహరిస్తోంది. అందులోనూ కరీంనగర్ జిల్లాకు సరైన వ్యక్తిని నియమించాలని అనుకుంటోంది. అయితే వెలిచాలా పేరు కూడా పరిశీలించాలని ఆయన అనుచరులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇటీవల గత ఎన్నికల్లో ఎమ్మెల్సీ గా పోటీ చేసిన నరేందర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ నేపథ్యంలో డిసిసి పదవి ఎవరిని వర్తిస్తుందోనని ఉత్కంఠ నెలకొంది.