హైదరాబాద్, నిఘా న్యూస్: ఏపీలో ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ పరీక్షల ఫలితాలు విడుదలయ్యా యి. అయితే, తెలంగాణలో త్వరలో ఇంటర్ పరీక్షల ఫలితాలను వెల్లడించేం దుకు ఇంటర్మీడియట్ బోర్డు సన్నాహాలు చేస్తోంది. ఈనెల 21 లేదా 25వ తేదీల్లో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది.
విద్యార్థి దశలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ఎంతో కీలకం. విద్యార్థి కెరీర్ కు పునాదులు వేసుకునే క్రమంలో పదో తరగతి పరీక్షలను విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. టెన్త్ ఫలితాల అనంతరం విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేందుకు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటారు.
ఈ క్రమంలో తెలంగాణలో పదో తరగతి పరీక్షల ఫలితాలపై పరీక్షలు రాసిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
తెలంగాణలో మార్చి 21వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరిగాయి. మొత్తం 2,650 కేంద్రాల్లో రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షలు నిర్వహించగా.. సుమారు ఐదు లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు.ఏప్రిల్ 7వ తేదీ నుంచి 19 కేంద్రాల్లో సమాధాన పత్రాల మూల్యాంకనాన్ని అధికా రులు ప్రారంభించారు. 15వ తేదీ వరకు మూల్యాంకనం ప్రక్రియ జరగనున్నట్లు తెలుస్తోంది.
సమాధాన పత్రాల మూల్యాంకనం ప్రక్రియ పూర్తయిన తరువాత ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా మరోసారి పేపర్లను అధికారులు చెక్ చేయనున్నట్లు తెలుస్తోంది. అందుకోసం వారంరోజుల సమయం పట్టే అవకాశం ఉంది.
దీంతో పదో తరగతి పరీక్షల ఫలితాలను ఈనెల 25వ తేదీ తరువాత విడుదల చేసేందుకు విద్యాశాఖ దృష్టిసారించినట్లు తెలుస్తోంది. ఇంటర్ ప్రథమ, ద్వితీయ పరీక్షల ఫలితాలు వెల్లడించిన తరువాతనే టెన్త్ పరీక్షల ఫలితాలను వెల్లడించే అవకాశం ఉంది.
పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులు ఫలితాలను ఎస్ఎస్సీ బోర్డు అధికారిక వెబ్ సైట్ https://bse.telangana.gov.in/ ద్వారా చెక్ చేసుకోవచ్చు.