45 వార్డు టిడిపిలో చేరికల సమావేశంలో గంటా
విశాఖపట్నం, ఏప్రిల్ 20, నిఘా న్యూస్: జగన్ ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని, చంద్రబాబు నాయుడు సీఎం అవ్వడం ఖాయమని భీమిలి అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు చెప్పారు. ఏదోలా అధికారం చేజిక్కించుకోవడానికి అడ్డదారులు, అరాచకాలకు సైతం వెనకాడటం లేదని విమర్శించారు. 45వ వార్డు వైసీపీ నుంచి టిడిపిలో చేరిన పలువురికి ఆయన పసుపు కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కష్టపడి పనిచేసిన వారికి పార్టీలో ఎప్పుడూ గుర్తింపు ఉంటుందన్నారు. భీమిలి వైసీపీ నాయకత్వంపై ఆ పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి నెలకొందని, అందుకే వారందరూ పెద్ద ఎత్తున టీడీపీలో చేరుతున్నారని తెలిపారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా వైసీపీ నేతలు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని చెప్పారు.
జగన్ ప్రచారానికి వెళ్లిన ప్రతి చోటా ప్రజలు తీవ్ర ఇక్కట్ల పాలవుతున్నారని అన్నారు. జగన్ సిద్ధం సభలకు ఆర్టీసి బస్సులు తరలించడంతో సామాన్య ప్రజానీకం నానా ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. పార్టీలో చేరిన వారిలో సింగాలమ్మపురం గ్రామ అధ్యక్షుడు చింతల బాబూరావు సహా ఆ గ్రామానికి చెందిన 100 మంది కార్యకర్తలు ఉన్నారు. కార్యక్రమంలో 45వ వార్డు టిడిపి అధ్యక్షుడు భరణికాన రాజు, విశాఖ పార్లమెంటరీ పార్టీ కార్యనిర్వహక కార్యదర్శులు పలిశెట్టి అప్పన్న, వాసుపల్లి రాజు తదితరులు పాల్గొన్నారు.