జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్, నిఘా న్యూస్: విద్యార్థులు అనవసర ఖర్చుల జోలికి వెళ్ళవద్దని, చిన్నప్పటి నుంచే డబ్బులు పొదుపు చేయడం అలవాటుగా మార్చుకోవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. గురువారం కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్ బైపాస్ రోడ్ లోని గిరిజన సంక్షేమ గురుకుల బాలుర డిగ్రీ కళాశాలలో ఆర్బీఐ ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల్లో భాగంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. దీనికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అందరూ ఆర్థిక అక్షరాస్యత పై అవగాహన పెంచుకోవాలని తెలిపారు. ఉన్న దాంట్లో తృప్తి పొందాలని, డబ్బుల విషయంలో లేనిపోని ఆశలకు పోయి సమస్యలు కొని తెచ్చుకోవద్దని సూచించారు. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని, ఎవరికి వారే జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. కష్టాన్ని నమ్ముకోవాలని, అతి త్వరగా కోటీశ్వరుడిని కావాలనే ఆశలు పెట్టుకోవద్దని తెలిపారు. అపరిచిత వ్యక్తుల నుంచి సెల్ ఫోన్లకు వచ్చే మెసేజ్ లకు ప్రజలు స్పందించవద్దని సూచించారు.
మోసపోతే ఇబ్బందులు పడతారని చెప్పారు. సైబర్ నేరాలకు దూరంగా ఉండాలని తెలిపారు. ఆర్థిక అక్షరాస్యత, డబ్బుల పొదుపు పై తల్లిదండ్రులకు విద్యార్థులు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. విద్యార్థులు డబ్బుల పొదుపుపై దృష్టిసారించాలని పేర్కొన్నారు. అత్యవసర సమయంలో ఉపయోగపడతాయని చెప్పారు. ఆర్బిఐ మేనేజర్ సాయి తేజా రెడ్డి, లీడ్ బ్యాంకు మేనేజర్ ఆంజనేయులు డబ్బుల పొదుపు, డిపాజిట్లు, ఆర్థిక అక్షరాస్యత, తదితర అంశాలపై అవగాహన కల్పించారు. కళాశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులు కలెక్టర్ కు ఘనంగా స్వాగతం పలికి సత్కరించారు. ఈ కార్యక్రమంలో మెప్మా పీడీ రవీందర్, ఎన్ వై కే కోఆర్డినేటర్ రాంబాబు, గిరిజన సంక్షేమ బాలుర డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ లావణ్య, కరీంనగర్ రూరల్ తాసిల్దార్ నవీన్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ శ్రీనివాస్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.
సహాయ సంచాలకులు సమాచార, పౌర సంబంధాల శాఖ కరీంనగర్ చే జారీ చేయనైనది.