పెద్దపల్లి, నిఘా న్యూస్: పెద్దపల్లి జిల్లాలో గురువారం సాయంత్రం కురిసిన అకాలవర్షం బీభత్సవాన్ని సృష్టించింది, కురిసిన వడగండ్ల వానలు పెద్దపల్లి జిల్లా రైతాంగాన్ని కోలుకోలేని దెబ్బ తీశాయి. అకాల వర్షం ధాటికి నేలవాలిన మొక్కజొన్న పంటలను పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి శనివారం పరిశీలించారు.
కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని వెన్నంపల్లి, కూనారం, మడిపల్లి, పెగడపల్లి, గంగారం, పందిళ్ళ, మంగపేట, జాఫరాఖాన్ పేట మొక్కజొన్నకు తీవ్రంగా నష్టం వాటిల్లింది, ఈ నేపథ్యంలోనే శనివారం వెన్నంపల్లి,జాఫర్గాన్ పేట, గ్రామాల్లో,పర్యటించిన ఆయన, దెబ్బతిన్న పంటలను చూసి ఆవేదన వ్యక్తం చేశారు. మంగపేట లో 25 మందికి చెందిన 35 ఎకరాలు కూనారంలో 72 మంది చెందిన 110 ఎకరాలు రైతులు తీవ్రంగా నష్టపోయారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ.. కాల్వ శ్రీరాంపూర్ మండలంలో సుమారు 400 ఎకరాల్లో మక్కజొన్న పంట పూర్తిగా దెబ్బతిందని తెలిపారు. పాలు పోసుకునే దశలో ఉన్న మొక్కజొన్న సేన్లు వడగండ్ల వానకు నేలమట్టం అయ్యాయి. చేతికందే సమయంలో పంటలు నష్టం కావడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారన్నారు.
పంట నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు రూ. 40, 000 చొప్పున ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభు త్వం వెంటనే స్పందించి అధికారులతో సమగ్ర సర్వే చేయించాలని ఆయన డిమాండ్ చేశారు..
ఈ కార్యక్రమంలో సర్పంచ్ మంథని రాజయ్య, మాజీ ఎంపీపీ నూనేటి సంపత్, మాజీ ఎంపీటీసీ జెట్టి దేవేందర్ మరియు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.


