ఎక్కువ సీట్లు తమకే వస్తాయంటున్న పార్టీ శ్రేణులు
వెలిచాల రాజేందర్ రావు కృషి ఫలిస్తుందంటున్న నేతలు
కరీంనగర్, నిఘా న్యూస్: కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికలు చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంత వాతావరణంలో ముగిశాయి. ఇప్పుడు అందరి చూపు కౌంటింగ్‌పై నిలిచింది. ఏ పార్టీ మేయర్ పీఠాన్ని దక్కించుకుంటుందనే అంశంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ సాగుతోంది. పోలింగ్ శాతం సంతృప్తికరంగా నమోదవడంతో ఫలితాలపై ఉత్కంఠ మరింత పెరిగింది.
పోలింగ్ రోజు ఓటర్ల స్పందనను పరిశీలించిన అధికార పార్టీ కాంగ్రెస్ నేతలు ఈసారి తమకే మెజార్టీ సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్ రావు స్వయంగా బాధ్యతలు తీసుకొని విస్తృత ప్రచారం నిర్వహించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇంటింటి ప్రచారం, వార్డు స్థాయిలో సమన్వయం, స్థానిక సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టడం వంటి అంశాలు తమకు అనుకూల వాతావరణాన్ని సృష్టించాయని కాంగ్రెస్ నాయకులు విశ్వసిస్తున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉండటం కూడా పట్టణ ఓటర్లపై ప్రభావం చూపిందని వారు అంచనా వేస్తున్నారు.
అయితే బీజేపీ కూడా వెనుకడుగు వేయడం లేదు. పట్టణ ప్రాంతాల్లో తమకున్న ఓటు బ్యాంక్, కేడర్ బలం, జాతీయ నాయకత్వ ప్రభావం కారణంగా మేయర్ పీఠం తమకే దక్కుతుందని కమలనాథులు ప్రకటిస్తున్నారు. గత ఎన్నికల ఫలితాలు, కొన్ని కీలక వార్డుల్లో కనిపించిన పోలింగ్ ధోరణి తమకు అనుకూలంగా ఉందని వారు చెబుతున్నారు.
ఇక ఇతర పార్టీల పాత్ర కూడా కీలకంగా మారే అవకాశం ఉంది. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోతే, స్వతంత్రులు లేదా చిన్నపార్టీల మద్దతు నిర్ణయాత్మకంగా మారవచ్చు. దీంతో కౌంటింగ్ రోజు ఉదయం నుంచే రాజకీయ చర్చలు మరింత వేడెక్కే అవకాశం ఉంది. మొత్తానికి కరీంనగర్ మేయర్ పీఠం కోసం కాంగ్రెస్, బీజేపీ మధ్య గట్టి పోటీ నెలకొంది. అధికార పార్టీ ధీమా, బీజేపీ సవాల్ ఈ రెండు మధ్య అసలు తీర్పు మాత్రం కౌంటింగ్ రోజే వెలువడనుంది. నగర రాజకీయ భవిష్యత్తును నిర్ణయించే ఆ క్షణాల కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


