ఓ ప్రధాన పార్టీ అభ్యర్థుల ఆవేదన..
పార్టీ గెలుపు కోసం కాకుండా డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపణ
కరీంనగర్, నిఘా న్యూస్: కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ కొనసాగుతోంది. ప్రతి డివిజన్లో గెలుపే లక్ష్యంగా పార్టీలు వ్యూహాలు రచిస్తున్నప్పటికీ… వాస్తవ పరిస్థితి మాత్రం అభ్యర్థులను ఆందోళనకు గురి చేస్తోంది. ముఖ్యంగా ఖర్చుల విషయంలో అభ్యర్థులు తీవ్ర తర్జనభజనలో పడుతున్నారు. పార్టీ టికెట్ దక్కితే ప్రచారానికి కనీస సౌకర్యాలు పార్టీ నుంచే అందుతాయన్న ఆశలు ఈసారి నెరవేరడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
పార్టీ కండువాలు, బ్యానర్లు, ఫ్లెక్సీలు, పాంప్లెట్ లెటర్స్ వంటి ప్రాథమిక ప్రచార సామగ్రికీ పార్టీ నుంచి నిధులు రావడం లేదని పలువురు అభ్యర్థులు వాపోతున్నారు. దీంతో తప్పనిసరిగా తమ సొంత ఖర్చుతోనే ఇవన్నీ కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక డివిజన్లో కనీస ప్రచార సామగ్రికే లక్షల రూపాయలు ఖర్చవుతుండటంతో ఆర్థికంగా బలహీనమైన అభ్యర్థులు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు.
ఇక మరోవైపు, కొన్ని పార్టీల్లోని స్థానిక నాయకులు ప్రచార సామగ్రి పేరుతో అభ్యర్థుల నుంచి ప్రత్యేకంగా డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ‘పార్టీ ఆఫీస్ ఖర్చులు’, ‘మీడియా మేనేజ్మెంట్’, ‘సోషల్ మీడియా ప్రచారం’ అంటూ వివిధ పేర్లతో డబ్బులు అడుగుతున్నారని చర్చ సాగుతోంది. దీంతో పార్టీ అభివృద్ధి, ప్రజా సేవ కంటే అభ్యర్థుల నుంచి డబ్బులు దండుకోవడమే కొందరు నాయకుల ప్రధాన లక్ష్యంగా మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ఈ పరిస్థితి వల్ల అసలైన ప్రజాసేవా దృక్పథం ఉన్న అభ్యర్థులు వెనకడుగు వేయాల్సి వస్తుండగా, డబ్బున్నవారికే రాజకీయాల్లో అవకాశాలు దక్కుతున్నాయన్న అభిప్రాయం బలపడుతోంది. ఎన్నికలు ప్రజాస్వామ్య పండుగలా ఉండాల్సిన బదులు… ఖర్చుల పోటీగా మారిపోతున్నాయన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. పార్టీ అధిష్ఠానాలు అయినా ఈ విషయంపై స్పందించి అభ్యర్థులకు మద్దతుగా నిలవాలని కార్యకర్తలు, అభ్యర్థులు కోరుతున్నారు.


