- ఎవరికి వారే అన్నట్లుగా ప్రచారం .
- వెలిచాల రాజేందర్ రావుకు మాత్రమే పట్టింపా?
కరీంనగర్, నిఘా న్యూస్: తెలంగాణలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలు రాజకీయంగా రసవత్తంగా మారుతున్నాయి. ఇందులో భాగంగా కరీంనగర్ కార్పొరేషన్ విషయంలో మిగతా వాటికంటే భిన్నంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకే ఎక్కువగా మద్దతు ఉంటుంది. ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉండగా.. రాష్ట్రవ్యాప్తంగా ఈ పార్టీదే గాలి వీచే అవకాశాలు ఉన్నట్లు కొందరు అంటున్నారు. కానీ కరీంనగర్లో మాత్రం విభిన్నంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ నుంచి బండి సంజయ్ జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు.. భారతీయ రాష్ట్ర సమితి నుంచి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ బాధ్యతలు మీదేసుకొని ప్రచారం నిర్వహిస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ లో మాత్రం ఎవరికి వారే అన్నట్లుగా సాగుతోంది. ఈ పార్టీ ప్రచార బాధ్యతలు ఎవరు తీసుకున్నారు? అన్న విషయంలో కాంగ్రెస్ కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండగా.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ఇద్దరు మంత్రులు.. ప్రభుత్వ విప్ లు.. కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు కేంద్రమైన కరీంనగర్ కార్పొరేషన్ లో కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమైన నేతలు ఎవరూ కనిపించడం లేదని కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటివరకు బిజెపి నుంచి బండి సంజయ్ వాడవాడలా తిరుగుతూ ఆ పార్టీ అభ్యర్థుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. ఒకరకంగా బిజెపికి కార్పొరేషన్ పీఠం వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆ పార్టీ నాయకులు నమ్మ పలుకుతున్నారు. మరోవైపు బిఆర్ఎస్ నుంచి గంగుల కమలాకర్ తో పాటు.. ముఖ్యమైన నేతలు ప్రచారంలో పాలుపంచుకుంటున్నారు. అయితే కాంగ్రెస్ నుంచి ముఖ్య నేత ఎవరు తమకు అండగా లేరని అంటున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే.. కాంగ్రెస్కు కష్టాలు తప్పవని అంటున్నారు.
ఓవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండగా కరీంనగర్ కార్పొరేషన్ పీఠంపై కాంగ్రెస్ జెండా ఎగిరితే ఎన్నో రకాలుగా ప్రయోజనాలు ఉంటాయి. దీనిని ప్రచారం చేసినా కూడా ప్రజల్లో కాంగ్రెస్ చొచ్చుకుపోయే అవకాశం ఉంది. కానీ ఈ ప్రచారం చేయడానికి ముఖ్య నేతలు ఎవరు కరీంనగర్ వైపు రావడం లేదని అంటున్నారు. అయితే కరీంనగర్ కార్పొరేషన్ బాధ్యతలు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్రావుకు ఇచ్చినట్లు చెబుతున్నా కూడా.. మిగతా నాయకులు కూడా ప్రచారంలో పాలుపంచుకోవడంతోనే పార్టీ గెలిచే అవకాశం ఉందని అంటున్నారు. కానీ ముఖ్య నేతలు అంతా ఎవరికి వారే అన్నట్లుగా ఉంటున్నారని పార్టీ నేతలు ఆవేదన చెందుతున్నారు.
ప్రచారానికి ఒక్కరోజు మాత్రమే ఉండడంతో ఇప్పటికైనా ముఖ్య నేతలు చివరి నిమిషంలో ప్రచారం చేసి ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేయాలని కోరుతున్నారు. లేకుంటే ప్రజల్లో కాంగ్రెస్పై అప నమ్మకం ఏర్పడే అవకాశం ఉందని చెబుతున్నారు.


