Friday, February 27, 2026

ప్రజలకు అందుబాటులో ఉంటా..: 42వ డివిజన్ అభ్యర్థి పంజాల రాజన్న

కరీంనగర్, నిఘా న్యూస్: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కరీంనగర్ కార్పొరేషన్ రాజకీయ వాతావరణం రోజురోజుకూ వేడెక్కుతోంది. ఈ క్రమంలో కార్పొరేషన్ పరిధిలోని 42వ డివిజన్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పంజాల రాజన్న బరిలోకి దిగారు. గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఆయన, తాజాగా బీజేపీ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చి ఎన్నికల పోరులో నిలవడం స్థానికంగా ఆసక్తికర చర్చకు దారి తీస్తోంది.

డాక్టర్ రాజన్న వృత్తిరీత్యా పశువుల వైద్యుడు. ఈ రంగంలో ఆయనకు మంచి గుర్తింపు ఉందని, ముఖ్యంగా పశుపోషణ, పశు ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటారని స్థానికులు చెబుతున్నారు. వైద్యుడిగా ప్రజలకు సేవ చేయడమే కాకుండా, ఇప్పుడు ప్రజాప్రతినిధిగా డివిజన్ అభివృద్ధికి కృషి చేయాలన్న లక్ష్యంతో తాను రాజకీయాల్లోకి వచ్చానని ఆయన ప్రచారంలో వెల్లడిస్తున్నారు.

42వ డివిజన్‌లో మౌలిక వసతుల లోపం, తాగునీటి సమస్య, రోడ్ల దుస్థితి, డ్రైనేజీ సమస్యలు ఉన్నాయని ఆయన ప్రస్తావిస్తున్నారు. తనను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే ఈ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తానని హామీ ఇస్తున్నారు. ప్రతి వీధికి మెరుగైన రోడ్లు, సరైన డ్రైనేజీ వ్యవస్థ, వీధిదీపాల ఏర్పాటు, పారిశుధ్య పనుల్లో పారదర్శకత తీసుకొస్తానని చెబుతున్నారు.

అలాగే మహిళలు, యువత, వృద్ధుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపడతానని డాక్టర్ రాజన్న పేర్కొంటున్నారు. ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా వార్డు స్థాయిలో ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. వార్డు కార్యాలయాన్ని ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంచి, సమస్యల పరిష్కారానికి వెంటనే స్పందిస్తానని తెలిపారు.

ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటాన్ని ప్రస్తావించిన ఆయన, తమ పార్టీకి చెందిన ప్రతినిధిగా గెలిపిస్తే నిధుల విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదని, డివిజన్‌ను అభివృద్ధి పథంలో నడిపిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద 42వ డివిజన్‌లో డాక్టర్ రాజన్న ప్రచారం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంటోందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular