మాజీ మేయర్ సునీల్ రావుపై తీవ్ర వ్యాఖ్యలు
కరీంనగర్, నిఘా న్యూస్ :తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని నిరూపించేందుకు తడి బట్టలతో హనుమాన్ ఆలయానికి వచ్చి ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నానని 42వ డివిజన్ కాంగ్రెస్ నేత డాక్టర్ రాజన్న ప్రకటించారు. మాజీ మేయర్ సునీల్ రావు కూడా తాను అవినీతికి పాల్పడలేదని హనుమంతుని పాదాల వద్ద ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు. శనివారం కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో నిర్వహించిన పత్రిక విలేకరుల సమావేశంలో డాక్టర్ రాజన్న మాట్లాడారు. గతంలో తనపై మాజీ మేయర్ సునీల్ రావు చేసిన ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. రాజకీయ విమర్శలకు ఒక పద్ధతి ఉంటుందని, దాన్ని దాటిపోయి అసభ్యకరంగా మాట్లాడటం తగదన్నారు. ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చిన వెలిచాల రాజేందర్ రావుపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. కాంట్రాక్టర్‌గా దోచుకున్నాడని, అవినీతి అనకొండ అంటూ వ్యాఖ్యలు చేయడం అసహ్యకరమని విమర్శించారు. తన ఉద్యోగ జీవితంపై కూడా అనవసర వ్యాఖ్యలు చేయడం బాధాకరమని అన్నారు.
తాను అవినీతికి పాల్పడి ఉంటే ఎప్పుడో జైలుకు వెళ్లేవాడినని స్పష్టం చేశారు. సరెండర్‌కు, సస్పెన్షన్‌కు తేడా తెలియని వ్యక్తి ఐదు సంవత్సరాలు మేయర్‌గా ఎలా కొనసాగాడో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. వైద్య విషయాలపై అవగాహన లేకుండా మాట్లాడడం తగదని, సంబంధిత వ్యవహారాలు ఢిల్లీ ఎన్‌డీటీపీ పరిధిలో ఉంటాయని గుర్తు చేశారు.సునీల్ రావు రాజకీయ జీవితాన్ని ప్రస్తావిస్తూ, కాంగ్రెస్‌లో పనిచేసిన తర్వాత టీఆర్‌ఎస్‌లోకి వెళ్లి మేయర్ అయ్యారని, ఆ తర్వాత రాజకీయ స్వలాభం కోసం బీజేపీలో చేరారని విమర్శించారు. ఇప్పుడు బండి సంజయ్ విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
తనపై వచ్చిన ప్రతి ఆరోపణను తిప్పికొట్టడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. తాను రాజకీయంగా ఎదగలేదని, కష్టార్జితంతో ఉద్యోగం చేసి ఎదిగానని అన్నారు. ఎవరి శిష్యరికంలో తాను పనిచేశాడో అందరికీ తెలుసని, అనవసర ఆరోపణలు మానుకోవాలని సూచించారు.
ఎప్పుడూ మంచితనమే గెలుస్తుందని, అవినీతి గెలవదని స్పష్టం చేశారు. తనను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే ఆర్టీఐ ద్వారా తన వద్ద ఉన్న ఆధారాలను బయటపెడతానని హెచ్చరించారు. తాను లోక్సత్తా ఎం. శ్రీనివాసు శిష్యుడినని, బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టం చేశారు.
తనపై ఆరోపణలు చేయకముందు వాస్తవాలు తెలుసుకోవాలని, లేదంటే ప్రతి ఆరోపణకు సమాధానం ఇవ్వాల్సి వస్తుందని హెచ్చరించారు. తనను ఆదరించేది డివిజన్ ప్రజలేనని, అవసరమైనప్పుడు అవినీతి చిట్టాను బయటపెడతానని తెలిపారు.ఈ పత్రిక విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు లయాక్, మహమ్మద్ చాంద్ తదితరులు పాల్గొన్నారు.


