కాంగ్రెస్లోకి మాజీ కౌన్సిలర్ ముద్రకోల వెంకటేశం, 300 మందితో చేరిక
వేములవాడ, నిఘా న్యూస్: మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బిఆర్ఎస్ పార్టీకి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలో భారీ ఎదురుదెబ్బ తగిలింది. వేములవాడ పట్టణానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ కౌన్సిలర్ ముద్రకోల వెంకటేశం శనివారం రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సమక్షంలో తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా దాదాపు 300 మంది కాంగ్రెస్ పార్టీలో చేరడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ పార్టీలో చేరిన వెంకటేశం సహా ఇతర నాయకులకు రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజల విశ్వాసాన్ని సంపాదించుకుంటోందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ సముచిత గౌరవం, ప్రాధాన్యం ఉంటుందని భరోసా ఇచ్చారు.
అనంతరం ముద్రకోల వెంకటేశం మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా బిఆర్ఎస్ పార్టీలో పని చేసినప్పటికీ తనకు సరైన గౌరవం, గుర్తింపు దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ విధానాలపై నమ్మకంతోనే కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కష్టపడి పనిచేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ చేరికతో వేములవాడ పట్టణ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ బలపడిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


