- రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా వేములవాడలో వాహనాల తనిఖీలు
- జిల్లా రవాణా శాఖ అధికారి లక్ష్మణ్
రాజన్న సిరిసిల్ల, నిఘా న్యూస్: డ్రైవింగ్ చేస్తున్న సమయంలో సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని జిల్లా రవాణా శాఖ అధికారి లక్ష్మణ్ వాహనదారులకు సూచించారు. రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం వేములవాడ కమాన్ వద్ద కార్లను విస్తృతంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ.. ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ మరియు రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలన్నారు. కార్లు నడిపేటప్పుడు సీట్ బెల్ట్ ధరించాలి, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, రాంగ్ రూట్‌లో ప్రయాణించరాదని, మొబైల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయరాదని హెచ్చరించారు. వేగాన్ని నియంత్రణలో ఉంచుకోవాలని, వాహనాన్ని రివర్స్‌లో తీసుకెళ్లే సమయంలో ముందు-వెనుక పరిసరాలను జాగ్రత్తగా గమనించాలని సూచించారు. సీట్ బెల్ట్ ధరించి వాహనం నడిపిన వారికి స్వీట్లు పంపిణీ చేయగా, సీట్ బెల్ట్ ధరించని వాహనదారులకు దాని ప్రాముఖ్యతను వివరించారు. వాహనాలకు రోడ్డు భద్రతకు సంబంధించిన స్టిక్కర్లు అతికించడంతో పాటు, సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించి వాహనం నడుపుతామని వాహనదారులతో రోడ్డు భద్రత మాసోత్సవాల ప్రతిజ్ఞ చేయించారు.
ఈ కార్యక్రమంలో వేములవాడ ట్రాఫిక్ ఎస్ఐ రాజు, మోటార్ వాహనాల తనిఖీ అధికారి వంశీధర్, సహాయక తనిఖీ అధికారి రజిని, పృథ్వీరాజ్ వర్మ తదితరులు పాల్గొన్నారు.


