Friday, February 27, 2026

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక : గెలుపెవరిదీ?

హైదరాబాద్, నిఘా న్యూస్: హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక రాజకీయంగా తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తోంది. పోలింగ్‌కు మరో ఐదు రోజులు మాత్రమే ఉండగా ప్రధాన రాజకీయ పార్టీలు తమ శక్తివంచన లేకుండా ప్రచారాన్ని కొనసాగిస్తున్నాయి. ఈ సీటు కోసం కాంగ్రెస్ తరఫున నవీన్ యాదవ్, బీఆర్ఎస్ తరఫున మాగంటి సునీత, బీజేపీ తరఫున లంకల దీపక్ రెడ్డి మధ్య త్రిముఖ పోరు నెలకొంది.

ప్రచార వేదికలపై మాటల యుద్ధం రగులుతోంది. కాంగ్రెస్ తరఫున సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు వ్యక్తిగతంగా ప్రచారంలో పాల్గొంటున్నారు. అభివృద్ధి, ప్రజా సంక్షేమ పథకాలతో ప్రభుత్వం చేసిన సేవలను ప్రజలకు వివరించడమే వారి ప్రధాన అజెండా. మరోవైపు, బీఆర్ఎస్ పార్టీ నుండి కేటీఆర్ రంగప్రవేశం చేశారు. జూబ్లీహిల్స్ ప్రాంతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన మౌలిక వసతుల అభివృద్ధి పనులను ప్రస్తావిస్తూ ప్రజా మద్దతు కోరుతున్నారు. బీజేపీ తరఫున కిషన్ రెడ్డి ప్రచారంలో దూకుడు చూపుతున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రస్తావనతో పాటు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు.ప్రచారం ఉధృతమవుతున్నకొద్దీ విమర్శలు, ఆరోపణలు, హామీలు పెరుగుతున్నాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు ఇళ్లకెళ్లి మద్దతు కోరుతుండగా, సోషల్ మీడియా ద్వారా ప్రచారం కూడా జోరందుకుంది. ఈ ఎన్నికలో నగర అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, పౌర సమస్యలు, మధ్యతరగతి ఓటర్ల ఆకాంక్షలు ప్రధాన అంశాలుగా మారాయి.

గెలుపెవరిది?
రాజకీయ విశ్లేషకుల అభిప్రాయాలు మాత్రం విభిన్నంగా ఉన్నాయి. కొందరి ప్రకారం గత ఎన్నికల్లో మాగంటి గోపీనాథ్ సెంటిమెంట్ కొనసాగి మాగంటి సునీత గెలిచే అవకాశం ఉందని అంటున్నారు. మరో వర్గం మాత్రం అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కు ఆధిక్యం ఉందని భావిస్తోంది. కానీ కాంగ్రెస్–బీఆర్ఎస్ ఓట్లు చీలితే బీజేపీ అనూహ్య విజయాన్ని సాధించే అవకాశం ఉందనే అంచనాలు కూడా వినిపిస్తున్నాయి. అయితే గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి సహా ముఖ్య నేతలు ప్రచారం చేసి అభ్యర్థుల విజయానికి కృషి చేశారని, ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి మార్క్ తో నవీన్ యాదవ్ గెలుస్తారని కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. అయితే హైడ్రా, తదితర కారణాలను ఎత్తి చూపుతూ బీఆర్ఎస్ పార్టీ జోరుగా ప్రచారం చేస్తోంది. మొత్తం మీద, జూబ్లిహిల్స్ ఉప ఎన్నిక రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తూ హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక సీట్లలో ఒకటిగా నిలుస్తోంది. ఇది ఉప ఎన్నిక అయినప్పటికీ ప్రధాన నేతలు రంగంలోకి దిగడంతో రాజకీయ వాతావరణం వేడేక్కుతోంది.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular