పాఠశాలలు కళాశాలల యాజమాన్యం ఆందోళన
కరీంనగర్, నిఘా న్యూస్:విద్యార్థుల భవిష్యత్తులను తీర్చిదిద్దేది పాఠశాలలు కళాశాలలు. ఒక వ్యక్తి జీవితానికి సంబంధించిన అన్ని విషయాలను ప్రాథమికంగా పాఠశాలలో.. ఆ తర్వాత కళాశాలలో నేర్చుకుంటాడు. విద్యార్థులు చదువుతోపాటు సమాజంపై కూడా అవగాహన కలిగి ఉండే సమయం కూడా ఇదే. అయితే ఇదే అదనుగా తీసుకున్న కొందరు తమ రాజకీయ భవిష్యత్తుకు విద్యార్థులను పావుగా వాడుకుంటున్నారు. ముఖ్యంగా బీసీ సంఘాలు అని చెప్పుకుంటూ కొందరు లీడర్లు కళాశాలల్లో పర్యటిస్తూ విద్యార్థులను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. భవిష్యత్తు గురించి విద్యార్థులకు ఏవేవో విషయాలు చెప్పి వారిని అయోమయానికి గురి చేస్తున్నారు. ప్రైవేట్ పాఠశాలలు కళాశాలనే ధ్యేయంగా ఎంచుకున్న కొందరు అక్రమ దందాకు పాల్పడుతున్నట్లు సమాచారం.
ఇటీవల ఓ పాఠశాలలో కొందరు తాము బీసీ నాయకులు అని చెప్పుకొని పాఠశాలలో విద్యార్థులకు అన్యాయం చేస్తున్నారంటూ యాజమాన్యంపై ఒత్తిడి తీసుకొచ్చారు. అంతేకాకుండా బీసీ విద్యార్థులకు అన్యాయం చేస్తున్నారు అంటూ పాఠశాల యాజమాన్యంపై విరుచుకుపడ్డారు. అయితే పాఠశాలల్లో లేదా కళాశాలలో సౌకర్యాల గురించి యాజమాన్యంతో చర్చించాల్సిన అవసరం ఉంది. కానీ తమ అవసరాల కోసం విద్యార్థులను అడ్డంగా పెట్టుకుని పాఠశాలల యాజమాన్యంతో విభేదాలు ఏర్పరచుకొని వారిని బెదిరిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
కొంతకాలంగా బీసీ నినాదం ఎక్కువగా వినిపిస్తోంది. బీసీకి చెందినవారు తమ హక్కుల కోసం పోరాడాలని కొన్ని సంఘాలు నినదిస్తున్నాయి. దీనిని అదునుగా చేసుకున్న కొందరు తాము బీసీ సంఘ నాయకులమని చెప్పుకుంటూ అక్రమంగా వసూలు చేస్తున్నారు. పాఠశాలల్లో కళాశాలల్లో సౌకర్యాల లేని లేదా బీసీ విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని వారి ని బెదిరింపులకు గురి చేస్తున్నట్లు ఆరోపిస్తున్నారు.
నిజంగా పిసి విద్యార్థుల కోసం పోరాడితే అది న్యాయపరంగా ఉండాలని దందా లాగా ఉండొద్దని కొందరు అంటున్నారు. అంతేకాకుండా గుర్తింపు పొందిన బీసీ సంఘం నాయకులు అయితే పర్వాలేదు కానీ కొందరు ఏదో పేరు చెప్పి తాము బీసీ సంఘం నాయకులు అంటూ బెదిరింపులకు గురి చేయడం వల్ల ఇబ్బందులకు గురవుతున్నామని పాఠశాల యాజమాన్య సంఘాలు తెలుపుతున్నాయి ఇలాంటి వారి విషయంలో నిజమైన బీసీ సంఘాలు దృష్టి పెట్టాలని కోరుతున్నారు.


