Thursday, February 26, 2026

కరీంనగర్లో మారనున్న రాజకీయ సమీకరణాలు?

  • మొదలైన ‘మున్సిపల్’ రాజకీయ వేడి
  • నాయకుల మధ్య పరస్పర విమర్శలు
  • కరీంనగర్ కార్పొరేషన్ పీఠం కోసం తీవ్ర పోటీ

కరీంనగర్ ప్రతినిధి, నిఘా న్యూస్: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ వాతావరణం రోజు రోజుకూ మరింత వేడెక్కుతోంది. ముఖ్యంగా బీఆర్ఎస్‌కు కంచుకోటగా పేరున్న కరీంనగర్ జిల్లా ఇప్పుడు హాట్ స్పాట్‌గా మారింది. గత కొన్నేళ్లుగా బీఆర్ఎస్ ఆధిపత్యం కొనసాగిన ఈ జిల్లాలో, ఈసారి కాంగ్రెస్ జెండా ఎగరవేసే అవకాశాలు ఉన్నాయని ఆ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర రాజకీయ పరిణామాలు, పార్టీ మార్పులు, స్థానిక సమీకరణాలు కాంగ్రెస్‌కు అనుకూలంగా మారుతున్నాయన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు వలస వెళ్తుండటం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు కాంగ్రెస్ పునరుజ్జీవనం కనిపిస్తోందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. రానున్న మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, బీఆర్ఎస్ పాలనపై అసంతృప్తి స్పష్టంగా కనిపిస్తోందని కాంగ్రెస్ నాయకత్వం అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో కరీంనగర్ జిల్లాను కాంగ్రెస్ కంచుకోటగా మార్చడమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది.

మరోవైపు బీజేపీ కూడా కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ పీఠంపై కన్నేసింది. గత ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతం, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీగా ఉన్న బలాన్ని చూపిస్తూ ఈసారి తప్పకుండా మేయర్ పదవిని కైవసం చేసుకుంటామని బీజేపీ నాయకులు చెబుతున్నారు. కాంగ్రెస్–బీఆర్ఎస్ మధ్య పోరు అనుకున్న చోట బీజేపీ మూడో శక్తిగా బలంగా ఎదుగుతోందన్న అభిప్రాయం కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. దీంతో కరీంనగర్‌లో త్రిముఖ పోటీ తప్పదన్న సంకేతాలు కనిపిస్తున్నాయి.

ఈ పరిస్థితుల్లో రాజకీయ వేడి మరింత పెరగడానికి ఇటీవల జరిగిన మాటల యుద్ధం కారణమైంది. కాంగ్రెస్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్ రావు, మాజీ మేయర్ సునీల్ రావు మధ్య పరస్పర విమర్శలు రాజకీయ వాతావరణాన్ని ఉత్కంఠభరితంగా మార్చాయి. అభివృద్ధి, అవినీతి, పాలన వైఫల్యాలపై ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకోవడం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని పెంచుతోంది. ఈ వ్యాఖ్యలు రానున్న ఎన్నికల ప్రచారానికి ట్రైలర్‌లా మారాయని విశ్లేషకులు అంటున్నారు.

మొత్తానికి కరీంనగర్ జిల్లాలో ఈసారి మున్సిపల్ ఎన్నికలు కేవలం స్థానిక పాలనకే కాదు, రాష్ట్ర రాజకీయాలకు కూడా దిశానిర్దేశం చేసేలా ఉండనున్నాయి. కాంగ్రెస్ జెండా ఎగురుతుందా? లేక బీఆర్ఎస్ తన పట్టు నిలుపుకుంటుందా? లేదా బీజేపీ అనూహ్యంగా మేయర్ పీఠాన్ని దక్కించుకుంటుందా? అన్న ప్రశ్నలకు సమాధానం ప్రజల తీర్పుతోనే తేలనుంది. అప్పటివరకు రాజకీయ వేడి మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular