తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత కాంగ్రెస్ నాయకులకు నామినేటెడ్ పోస్టుల కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. ఎమ్మెల్యే, ఎంపీ ఎలక్షన్ పూర్తయిన తరువాత వెంటనే ఆయా జిల్లా, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న నాయకులు ఈ పోస్టుల కోసం పైరవీలు కూడా ప్రారంభించారు. అయితే స్థానిక ఎన్నికలు పూర్తయిన తరువాత వీటి నియామకం ఉంటుందని కొందరు చర్చించుకుంటున్నారు. కానీ ఆలస్యమైతే మొదటికే మోసం వస్తుందని కొందరు నేతలు చర్చించుకుంటున్నారు. కరీంనగర్ జిల్లా వంటి ప్రాంతాల్లో కాంగ్రెస్ ఇప్పుడిప్పుడే గాడిలో పడుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇక్కడ సరైన నాయకుడి కోసం అధిష్టానం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సమయంలో జిల్లా కాంగ్రెస్ బాధ్యతలు వెలిచాల రాజేందర్ రావుకు అప్పగిస్తారన్న ప్రచారం సాగుతోంది. మరి వెలిచాలకు కాంగ్రెస్ బాధ్యతలు అప్పగిస్తే పరిస్థితి ఎలా ఉండబోతుంది?
వెలిచాల జగపతి రావు వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన వెలిచాల రాజేందర్ రావు గత ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేశారు. అయితే ఆ సమయంలో బండి సంజయ్ హవా ఉండడంతో గెలవలేకపోయారు. అంతేకాకుండా గత అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ నుంచి గంగుల కమలాకర్ గెలుపొందారు. దీంతో వచ్చే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఈ జిల్లా సవాల్ గా మారింది. దీంతో ఇక్కడ సరైన నాయకుడిని నియమిస్తేనే కాంగ్రెస్ కు అనుకూల వాతావరణం ఉంటుందని కొందరు నాయకులు చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వెలిచాల రాజేందర్ రావు ను నియమించాలని చర్చించుకుంటున్నారు.
గత ఎంపీ ఎన్నికల్లో ఓడిపోయినా.. వెలిచాల రాజేందర్ రావు ప్రజలను కలుస్తూ ఉన్నారు. ముఖ్యంగా గ్రామాల్లో కాంగ్రెస్ నిర్వహించే ప్రతీ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. తాజాగా పీసీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘జనహిత పాదయాత్ర’లో భాగస్వాములయ్యారు.ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు గ్రామాల నుంచి కార్యకర్తలను రప్పించేందుకు తీవ్ర కృషి చేశారు. వారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తూ బాగోగులు చూసుకున్నారు. అలాగే పార్టీ నిర్వహించే ప్రతీ కార్యక్రమంలో ముందుంటున్నారు.
ఈ నేపథ్యంలో వెలిచాల రాజేందర్ రావుకు జిల్లా బాధ్యతలు అప్పగిస్తే పార్టీ మరింత బలోపేతం అవుతుందని అంటున్నారు. ఇప్పటికే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరీంనగర్, హుజూరాబాద్, కోరుట్ల నియోజకవర్గాలు మినహా అన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ కు బలం ఉంది. అయితే వెలిచాల రాజేందర్ రావు ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లాలో పార్టీని గాడిలో పెట్టేందుకు కార్యకర్తలు తీవ్ర కృషి చేస్తున్నారు. పార్లమెంట్ నియోజకవర్గ స్థాయిలో పార్టీ పుంజుకుంటున్న తరుణంలో జిల్లా బాధ్యతలు అప్పగిస్తే వచ్చే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం అని అంటున్నారు. మరి అధిష్టానం మదిలో ఏముందో చూడాలి.