కరీంనగర్, నిఘా న్యూస్: గత అసెంబ్లీ ఎన్నికల తో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అయితే మొదట్లో ఈ పార్టీ గురించి చాలామంది పట్టించుకోకపోయినా.. ఆ తర్వాత ప్రభుత్వం చేస్తున్న కొన్ని ప్రత్యేక కార్యక్రమాల ద్వారా పార్టీకి ఆకర్షితులయ్యే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. దీంతో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయడానికి చాలామంది ఉత్సాహం చూపించడానికి సిద్ధంగా ఉన్నట్టు చర్చ జరుగుతుంది. అయితే కరీంనగర్ జిల్లాలో పార్టీ ని గాడిన పెట్టేందుకు అధిష్టానం తీవ్రంగా కసరత్తు చేస్తుంది. ప్రస్తుతం ఇక్కడ జిల్లా అధ్యక్షుడి పోస్టుతో పాటు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి పదవి ఖాళీగా ఉంది. దీంతో ఈ రెండు పోస్టుల్లో సరైన నాయకులను నియమిస్తే వచ్చే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూరుతుందని చర్చించుకుంటున్నారు. ఈ తరుణంలో ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి పేరు వినిపిస్తోంది.
గత పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, కరీంనగర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేశారు. అయితే ఈ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి అంజిరెడ్డి గెలుపొందారు. అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి రెండో స్థానంలో నిలిచారు. పోటాపోటీగా జరిగిన ఈ ఎన్నికల్లో ఒక దశలో నరేందర్ రెడ్డి గెలుపొందుతారు అన్న చర్చ జరిగింది. అయితే ఈ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన పార్టీకి దూరం కాలేదు. నిత్యం పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఓవైపు విద్యాసంస్థల నిర్వహణలో పాలుపంచుకుంటూనే.. మరోవైపు కాంగ్రెస్ పార్టీ తరపున జరిగే కార్యక్రమాల్లో యాక్టివ్గా ఉంటున్నారు.
ఈ నేపథ్యంలో కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జిగా నరేందర్ రెడ్డి ని నియమిస్తే బాగుంటుందని ఆయన సన్నిహితులు పేర్కొంటున్నారు. అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జిగా ఇప్పటివరకు పురమళ్ళ శ్రీనివాస్ ఉండేవారు. ఆయన సస్పెండ్ తర్వాత మరో వ్యక్తిని నియమించలేదు. అంతేకాకుండా కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో కొంతమంది నాయకులు మాత్రమే పలు కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారని.. వారిలో నరేందర్ రెడ్డి ముందు ఉన్నారని ఆయన అనుచరులు అభిప్రాయపడుతున్నారు.
కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో కొన్ని ఏళ్లుగా బి ఆర్ ఎస్ పార్టీనే పాగా వేసింది. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని గాడిలో పెట్టడానికి సరైన నాయకత్వం కావాల్సి ఉంది. ఇలాంటి తరుణంలో అసెంబ్లీ నియోజకవర్గ వ్యాప్తంగా పరిచయం ఉన్న నరేందర్ రెడ్డిని నియమిస్తే పార్టీకి గుర్తింపు వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇప్పటికే నరేందర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన విషయం తెలిసిందే. అయితే కరీంనగర్ జిల్లాలో నామినేటెడ్ పోస్టులతో పాటు మరికొన్నింటిని ఆపేశారు. కానీ వచ్చే స్థానిక ఎన్నికల్లో పార్టీ సీట్లను తెచ్చుకోవాలంటే నరేందర్ రెడ్డి నీ నియమించాల్సిన అవసరం ఉందని అంటున్నారు. మరి అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.


