కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ చార్జీగా నియమించే అవకాశం
త్వరలో ఉత్తర్వులు?
కరీంనగర్, నిఘా న్యూస్: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంపై కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి ఉన్న పట్టును దెబ్బతీయడానికి, వచ్చే స్థానిక ఎన్నికల్లో విజయం సాధించడానికి, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వెలిచాల రాజేందర్ రావుకు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి కావస్తున్న తరుణంలో, నామినేటెడ్ పదవుల కోసం పార్టీ కార్యకర్తలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి తగిన గుర్తింపు లభించాలనే ఆకాంక్ష బలంగా ఉంది. ఈ నేపథ్యంలో, కరీంనగర్ వంటి కీలక నియోజకవర్గానికి సరైన నాయకత్వాన్ని అప్పగించడం ద్వారా, పార్టీ శ్రేణులలో నూతన ఉత్తేజాన్ని నింపవచ్చని భావిస్తున్నారు.
వెలిచాల రాజేందర్ రావు ఒక బలమైన అభ్యర్థి
గతంలో కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయినప్పటికీ, వెలిచాల రాజేందర్ రావు నియోజకవర్గ ప్రజలతో నిరంతరం సంబంధాలు కొనసాగిస్తూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. నిత్యం ప్రజల్లోనే ఉంటూ, పార్టీ కార్యక్రమాలను చురుగ్గా నిర్వహిస్తూ, అధిష్టానం దృష్టిని ఆకర్షించడంలో ఆయన సఫలీకృతులయ్యారని చెప్పవచ్చు. ఆయనకున్న ప్రజాదరణ, కార్యకర్తలను కదిలించగల సత్తా, బీఆర్ఎస్ పార్టీకి గట్టి పోటీనిచ్చే అవకాశం కల్పించగలవని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఎన్నికల వ్యూహంలో కీలక అడుగు
కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ పట్టును సడలించాలంటే, బలమైన నాయకత్వం అవసరం. వెలిచాల రాజేందర్ రావును ఇన్‌చార్జ్‌గా నియమిస్తే, ఆయన నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలతో మమేకమై, వారి సమస్యలను పరిష్కరిస్తూ, వచ్చే స్థానిక ఎన్నికల్లో పలుచోట్ల విజయం సాధించే అవకాశాలు మెరుగవుతాయని పార్టీ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నియామకం, కరీంనగర్ రాజకీయాల్లో ఒక కీలక మార్పునకు నాంది పలుకుతుందని భావిస్తున్నారు.
పోటా పోటీ
వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక దృష్టి పెట్టింది. అందులోనూ కరీంనగర్ లాంటి నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థుల కోసం ఎదురుచూస్తున్న తరుణంలో ఈ పోస్టుపై కొందరు ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభిస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన సమయంలో కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పట్టు లేనప్పటికీ ఆ తరువాత కాంగ్రెస్ వైపు చాలా మంది చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి కొంత మంది కార్పొరేటర్లు కాంగ్రెస్ లోకి వెళ్లారు. వచ్చే ఎన్నికల్లోపు మరింత మంది వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు. ఈ తరుణంలో కాంగ్రెస్ కు బలం పెరిగే అవకాశం ఉండడంతో ఈ నియోజకవర్గ ఇన్ చార్జీ పోస్టుపై ఆసక్తి పెరిగింది.


