వర్గ విభేదాలతో కార్యకర్తల ఆందోళన
పార్లమెంట్ ఎన్నికలపై ప్రభావం
ఇప్పడు చక్కబెడితేనే నయం..
లేకుంటే భారీగా నష్టం..
కరీంనగర్ ప్రతినిధి, నిఘా న్యూస్: తెలంగాణ రాష్ట్రంలోనే కరీంనగర్ కు ప్రత్యేక స్థానం ఉంది. రాష్ట్ర రాజకీయాల్లో అనేక మార్పులకు కరీంనగర్ కేంద్రంగా మారుతోంది. కరీంనగర్ ఒకప్పుడు కాంగ్రెస్ కు కంచుకోటగా ఉండేది. దీంతో ఆ పార్టీలో నిత్యం పై స్థాయి నాయకులు బయట పార్టిలోకి వెళ్లినా.. కార్యకర్తలు మాత్రం ‘చేయి’తోనే ఉంటున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కాంగ్రెస్ కు కొన్ని రోజులు గడ్డు పరిస్థితులు ఏర్పడినా.. ఆ తరువాత పార్టీని ఆదరించారు. 2023లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక.. కరీంనగర్ లో పార్టీ మరోసారి బలపడుతోంది. ఇలాంటి సమయంలో పార్టీలో వర్గ విభేదాలు కల్లోలం రేపుతున్నాయి.
2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మూడో స్థానంలో నిలిచింది. అయితే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక పార్టీ పరిస్థితి మెరుగుపడుతోంది. ఎందుకంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొత్తం 12 స్థానాల్లో 7 చోట్ల పార్టీ విజయం సాధించింది. దీంతో పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ సత్తా చూపాలని అధిష్టానం భావిస్తోంది. ఇందులో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు నామినేటెడ్ పదవులను కేటాయించి ప్రోత్సహించింది. తెలంగాణలో కరీంనగర్ ను కీలకంగా భావించి మూడు పదవులను కట్టబెట్టడంతో పార్టీ నాయకుల్లో హర్షం వ్యక్తమవుతోంది.
అయితే ఈ నామినేటెడ్ పోస్టులు వర్గ విభేదాలకు ఆజ్యం పోసినట్లయింది. కరీంనగర్ పట్టణ అధ్యక్షుడిగా కొనసాగుతున్న కోమటిరెడ్డి నరేందర్ రెడ్డికి సుడా చైర్మన్ పదవిని అధిష్టానం కేటాయించింది. కానీ పార్టీలోని కొందరు ఆయనకు పదవిని కట్టబెట్టడంపై అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా జిల్లాకు చెందిన మంత్రి పొన్నం ప్రభాకర్ తనకు తెలియకుండా సుడా చైర్మన్ పదవిని ఎలా కట్టబెట్టారనే అలకతో ఉన్నట్లు సమాచారం. అంతేకాకుండా కొందరు ఈ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. దీంతో కోమటిరెడ్డికి కేటాయించడంపై వారు నిరాశతో ఉన్నారు.
ఈ నేపథ్యంలో పార్టీలోని కొందరు నాయకులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టగా హాజరు కాలేదు. ముఖ్యంగా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన పురమళ్ల శ్రీనివాస్, అతని అనుచరులు, పొన్నం వర్గీయులు నరేందర్ రెడ్డి ప్రెస్ మీట్లో కనిపించడం లేదు. రాష్ట్రంలో అధికారంలో ఉన్నా.. కరీంనగర్ కాంగ్రెస్ లో మాత్రం ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు గా వ్యవహరిస్తన్నారు. ఈ పరిస్థితి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రభావం చూపతుందని కొందరు కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.
ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి పార్లమెంట్ అభ్యర్థి ఎవరో తెలియక సతమతమవుతున్నారు. ఇలాంటి తరుణంలో పార్టీలో గ్రూపు విభేదాలు ఉండడం వల్ల తీవ్ర నష్టం ఉండే అవకాశం ఉందని అంటున్నారు. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ మధ్యే పోరు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ పరిస్థితిని కాంగ్రెస్ క్యాష్ చేసుకుంటే లాభం జరుగుతుంది. ఇలా గ్రూపు విభేదాలతో తీవ్ర నష్టమే ఉంటుందని కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పిటికైనా అధిష్టానం దృష్టి పెట్టి పార్టీని ఒక్కతాటిపైకి తీసుకొచ్చేలా ప్రయత్నం చేయాలని కొందరు కార్యకర్తలు కోరుతున్నారు.