కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం
కరీంనగర్, నిఘా న్యూస్: చిన్న హనుమాన్ జయంతి సందర్బంగా ఈ నెల 12వ తేదీ శనివారంనాడు కరీంనగర్ లో నిర్వహించనున్న శ్రీ వీరహనుమాన్ విజయ యాత్రకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు ఏర్పాట్లు చేయనున్నట్లు కరీంనగర్ పోలీస్ కమీషనర్ గౌష్ ఆలం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్బంగా పోలీస్ కమీషనర్, టౌన్ ఏసీపీ కార్యాలయంలో గురువారంనాడు డివిజన్ లోని పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు. శోభాయాత్ర సందర్బంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై ఆయన సమీక్షించారు. ఈ యాత్ర కరీంనగర్లోని వైశ్య భవన్ ప్రక్కన గల రామాలయం నుండి ప్రారంభమై రాజీవ్ చౌక్ , టవర్ సర్కిల్ , గంజ్ రోడ్ , రూరల్ పోలీస్ స్టేషన్ చౌరస్తా , కమాన్ రోడ్ మీదుగా , బస్టాండ్ , తెలంగాణ చౌక్ , ఐబీ చౌరస్తా , కోర్ట్ చౌరస్తా , మంచిర్యాల చౌరస్తా , గాంధీ స్టాట్చ్యు తిరిగి రామాలయం వద్ద ముగుస్తుందని తెలిపారు. దాదాపు ఆరు కిలోమీటర్ల మేర నిర్వహించు ఈ యాత్రకు 500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని పోలీసు కమీషనర్ తెలిపారు. బందోబస్తులో భాగంగా స్టాటిక్ ఫోర్స్ , స్ట్రైకింగ్ ఫోర్స్ , మొబైల్ పెట్రోలింగ్ , అవసరమైన చోట రూఫ్ టాప్ లతో పాటు సున్నితమైన ప్రాంతాల్లో పికెట్ లు కూడా ఏర్పాటు చేస్తున్నామని కమీషనర్ తెలిపారు. ఈ యాత్రలో సీసీ కెమెరా ల పర్యవేక్షణతో పాటు పోలీసు డ్రోన్ లను వాడనున్నామని ఆయన తెలిపారు. ట్రాఫిక్ రద్దీ వుండే ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు దారి మల్లింపు చర్యలు చేపడుతున్నారని ఆయన తెలిపారు. యాత్ర నిర్వహించు మార్గం అంతా పోలీసు కమీషనర్ గురువారంనాడు ప్రత్యక్షంగా క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు.ఈ కార్యక్రమంలో పోలీసు కమీషనర్ తో పాటు అడిషనల్ డీసీపీ ఏ లక్ష్మీనారాయణ, ఏసీపీ లు వెంకటస్వామి టౌన్ , యాదగిరిస్వామి ట్రాఫిక్ , టౌన్ ఇన్స్పెక్టర్లు బిల్లా కోటేశ్వర్ , సృజన్ రెడ్డి , జాన్ రెడ్డి , ఖరీముల్లాఖాన్ లతో పాటు ఇతర అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.