Thursday, February 26, 2026

టార్గెట్ కరీంనగర్ కార్పొరేషన్..

  • కార్పొరేషన్ ఎన్నికల బాధ్యతను మీదేసుకున్న వెలిచాల రాజేందర్ రావు
  • కంటిమీద కునుకు లేకుండా కసరత్తు
  • కొందరు నేతలు సహకరించడం లేదని అనుచరుల ఆవేదన
  • పార్టీ గెలుపునకు కృషి చేయాలని కోరుతున్న కార్యకర్తలు

కరీంనగర్, నిఘా న్యూస్: కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు రోజురోజుకు మరింత ఆసక్తికరంగా మారుతున్నాయి. అన్ని ప్రధాన పార్టీలు ఇప్పటికే తమ అభ్యర్థుల జాబితాలను ప్రకటించడంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. టికెట్లు దక్కించుకున్న అభ్యర్థులు ఇంటింటి ప్రచారం, సమావేశాలు, రోడ్‌షోలు అంటూ హోరెత్తిస్తుండగా… టికెట్ దక్కని నేతల్లో అసంతృప్తి స్వరాలు వినిపిస్తున్నాయి. ఈ మొత్తం పరిణామాల మధ్య కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత రాజకీయాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.ముఖ్యంగా అధికార పార్టీ కాంగ్రెస్‌లో వెలిచాల రాజేందర్రావు పాత్రపై విస్తృతంగా చర్చ సాగుతోంది. కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్‌కు సంబంధించి అనేక మంది సీనియర్, జూనియర్ నాయకులు ఉన్నప్పటికీ… ఈ కార్పొరేషన్ ఎన్నికల బాధ్యత ఎక్కువగా వెలిచాల రాజేందర్రావుపైనే పడినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఆయన టికెట్ల పంపిణీ నుంచి ప్రచార వ్యూహాల వరకు కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల బరిలో సమన్వయంతో ముందుకు వెళ్తోందనే అభిప్రాయం ఒకవైపు వినిపిస్తోంది.

మరోవైపు కొందరు నాయకులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. “వెలిచాల రాజేందర్రావుకు పార్టీ స్థాయిలో సరైన సపోర్టు అందడం లేదు” అంటూ కొందరు కాంగ్రెస్ నేతలు బహిరంగంగానే అభిప్రాయపడుతున్నారని తెలుస్తోంది. పార్టీలోని కొంతమంది కీలక నేతలు ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిస్తూ ఎన్నికల ప్రచారంలో పెద్దగా ఆసక్తి చూపించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితి కొనసాగితే కాంగ్రెస్ పార్టీకి నష్టం తప్పదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఇలాంటి పరిస్థితుల మధ్య కూడా వెలిచాల రాజేందర్రావు మాత్రం వెనకడుగు వేయడం లేదని ఆయన అనుచరులు చెబుతున్నారు. “కరీంనగర్ కార్పొరేషన్‌పై కాంగ్రెస్ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా ఆయన పగలు-రాత్రి తేడా లేకుండా పనిచేస్తున్నారు. అభ్యర్థులను సమన్వయం చేస్తూ, క్యాడర్‌ను కదిలిస్తూ ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు” అని వారు పేర్కొంటున్నారు. పార్టీ లోపలి విభేదాలను పక్కనపెట్టి గెలుపే లక్ష్యంగా ఆయన అడుగులు వేస్తున్నారని అంటున్నారు.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ భవితవ్యం ఇకపై పార్టీ నేతల సమిష్టి కృషిపైనే ఆధారపడి ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికైనా పార్టీలోని ఇతర నాయకులు వ్యక్తిగత అసంతృప్తులను పక్కనపెట్టి వెలిచాల రాజేందర్రావుకు పూర్తి స్థాయిలో సహకరిస్తేనే కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. కరీంనగర్ రాజకీయాల్లో ఈ ఎన్నికలు ఎలాంటి మలుపు తిప్పుతాయో చూడాల్సిందే.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular