కరీంనగర్, నిఘా న్యూస్:కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోరు జోరుగా సాగుతోంది. ఈ ఎన్నికల్లో 55 మంది పట్టభద్రులు పోటీ చేస్తున్నారు. అలాగే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో15 మంది ఉపాధ్యాయులు పొడి చేస్తున్నారు. అయితే పట్టపద్రుల నియోజకవర్గంలో ప్రధానంగా తీవ్రమైన పోటీ నెలకొన్నట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికల మరిలో చాలావరకు పోటీ చేస్తున్న ప్రధానంగా రెండు పార్టీల మధ్య మాత్రం హోరాహోరీ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ మధ్య ప్రధాన పోటీ ఉన్నట్లు కనిపిస్తోంది. బిజెపి తరఫున అంజీ రెడ్డి పోటీ చేస్తుండగా.. కాంగ్రెస్ తరపున నరేందర్ రెడ్డి బరిలో ఉన్నారు. ఈ రెండు పార్టీల్లో విజేతలు ఎవరో అన్న ఆసక్తి నెలకొంది.
పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గంలో నీ నాలుగు జిల్లాల్లో పార్టీ పరంగా బిజెపి బలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయా జిల్లాల్లో నలుగురు బిజెపి ఎంపీలు ఉన్నారు. అలాగే ఏడుగురు ఎమ్మెల్యేలు ఈ జిల్లాలోని వారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో తమ అభ్యర్థి గెలుపు ఖాయమని బిజెపి నాయకులు అనుకుంటున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న తమ పార్టీ అభ్యర్థి గెలిస్తే పట్టభద్రులకు సరైన న్యాయం జరుగుతుందని వారు చెబుతున్నారు. అలాగే కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ ఆధ్వర్యంలో పార్టీ మరింత విస్తరించి అవకాశం ఉందని ఆ పార్టీ నాయకులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే ఈ నాలుగు జిల్లాల్లోని మండలాల్లో సైతం పార్టీ నాయకులు పట్టపద్రులు కలిసి ఓటు వేయాలని అడుగుతున్నారు.
కాంగ్రెస్ తరపున ఆల్ ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఈయన తన విద్యా సంస్థల ద్వారా వ్యక్తిగతంగా అందరికీ పరిచయస్తుడే. అయితే రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ ద్వారా బరిలో ఉండడం మరింత ప్రాధాన్యతను పెంచుకున్నట్లు అయింది. దీంతో పాటు ఆయా జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉండడంతో గెలుపు తమదేనని కాంగ్రెస్ పార్టీ నాయకులు అనుకుంటున్నారు. ఈ మేరకు నరేందర్ రెడ్డి తరఫున కొందరు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించారు. అయితే పార్టీలోని అందరూ కలిసి వస్తున్నారా లేదా అనేది మాత్రం ప్రశ్నార్థకమేనని కొందరు అంటున్నారు. పార్టీకి చెందిన కొందరు ముఖ్య నాయకులు నరేందర్ రెడ్డి గెలుపు కోసం ప్రత్యేకంగా కృషి చేస్తున్నారా అనేది చర్చనీయాంశమేనని పేర్కొంటున్నారు.
అయితే మిగతా ప్రధాన పార్టీల తరపున అభ్యర్థులు లేనందున ఈ రెండు పార్టీల మధ్య పోటీ ఉండనుంది. ఈ ఎమ్మెల్సీ ఎన్నిక ద్వారా పార్టీలు తమ ప్రభావాన్ని ఏర్పాటు చేసుకొని అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఈ ఎమ్మెల్సీ ఎన్నిక ద్వారా గెలుపొందితే మరింత విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటివరకు ప్రవేశపెట్టిన ప్రభుత్వ పథకాల ద్వారా కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తున్నారని చెప్పుకునేందుకు ఇది అవకాశం గా మలుచుకోనున్నారు. అటు బిజెపి సైతం కేంద్రం సహకారంతోనే రాష్ట్రంలో అభివృద్ధి పనులు సాగుతున్నాయని చెప్పుకునేందుకు ఎమ్మెల్సీ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మరోవైపు వచ్చే ఎన్నికల వరకు పార్టీని బలంగా మార్చుకునేందుకు ఈ ఎన్నిక కూడా ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మరి ఈ రెండు పార్టీల మధ్య ఉన్న పోరు చివరికి ఎక్కడికి వెళ్తుందో చూడాలి..