ఎవరు గెలిచిన చరిత్రే!
హైదరాబాద్, నిఘా న్యూస్: టీ20 ప్రపంచకప్ 2026 ఆఖరి అంకానికి చేరుకుంది. ఆదివారం భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మ్యాచ్‌లో అటు భారత్, ఇటు న్యూజిలాండ్ ఎవరు గెలిచినా కూడా చరిత్రే అవుతుంది.
ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ విజయం సాధిస్తే.. తొలిసారి ఆ జట్టు పొట్టి ప్రపంచకప్‌ను ముద్దాడుతుంది. ఒకవేళ భారత్ గెలిస్తే.. అప్పుడు వరుసగా రెండోసారి కప్పు ను సొంతం చేసుకోవడంతో పాటు ఆతిథ్య దేశంగా టీ20 ప్రపంచకప్‌ను సొంతం చేసుకున్న తొలి దేశంగా నిలుస్తుంది. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే రెండు జట్లు అహ్మదా బాద్‌కు చేరుకున్నాయి. ప్రాక్టీస్‌ను కూడా మొదలుపెట్టాయి.
అయితే.. టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఇప్పటి వరకు భారత జట్టు న్యూజిలాండ్ పై విజయం సాధించకపో వడం ఆందోళన కలిగించే విషయం. ఇరు జట్లు ఇప్పటి వరకు మూడు సార్లు టీ20 ప్రపంచకప్‌లో తలపడగా అన్ని మ్యాచ్ ల్లోనూ న్యూజిలాండ్ విజయం సాధించింది.
బ్యాటింగ్ పిచ్?
ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో పరుగుల వరద పారిన సంగతి తెలిసిందే. తొలుత భారత్ 253 పరుగులు చేయగా, ఆ తరువాత ఇంగ్లాండ్ 246 పరుగులు చేసింది. ఇక ఫైనల్ మ్యాచ్‌లోనూ పరుగుల పండగ ఉంటుందని అంటున్నారు.
మోదీ స్టేడియంలో మూడు రకాలు పిచ్‌లు.. ఎర్రమట్టి, నల్లమట్టి, ఎరుపు-నలుపు కలిసిన పిచ్ లు ఉన్నాయి. ఇటీవల సూపర్-8లో దక్షిణాఫ్రికాతో ఇదే మైదానంలో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఓడిపోయింది. ఆ మ్యాచ్‌లో నల్లమట్టి పిచ్‌ను ఉపయోగించారు.
అయితే.. ఫైనల్ మ్యాచ్‌లో ఎర్రమట్టి, నల్లమట్టి మిశ్రమంతో పిచ్‌ను సిద్ధం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ పిచ్‌లో 70 శాతం ఎర్రమట్టి, 30 శాతం నల్లమట్టి ఉంటుంది. ఈ పిచ్ పై మంచి బౌన్స్ ఉంటుందని, పేసర్లకు సాయపడుతుందని అంటున్నారు. బ్యాటర్లకు కూడా పరుగుల పండగ చేసుకోవచ్చు. ఈ పిచ్ పై 200 స్కోర్లు నమోదు అయ్యే అవకాశం ఉందని పలు నివేదికలు చెబుతున్నాయి.


