రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
వేములవాడ, జనవరి 11(నిఘా న్యూస్) : రైతాంగం సుభిక్షంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆకాంక్షించారు. ఆదివారం వేములవాడ పట్టణంలో మహాలక్ష్మి రైతు మిత్ర సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కాటిరేవుల కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముందుగా రేణుకా ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ, సంక్రాంతి పండుగ సందర్భంగా కాటిరేవుల పండుగను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని తెలిపారు.
వ్యవసాయంలో రైతులకు చేదోడు వాదోడుగా నిలిచే ఎడ్లను చక్కగా అలంకరించి, వాటికి ఎలాంటి ఇబ్బందులు లేదా అనారోగ్య సమస్యలు రాకుండా ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతుందని పేర్కొన్నారు. మహాలక్ష్మి రైతు మిత్ర సంఘం ఆధ్వర్యంలో ఎడ్ల ప్రతిరూపాలను తయారు చేసి వాటిని కొలవడం ద్వారా ఈ సంప్రదాయాన్ని కొనసాగించడం అభినందనీయమన్నారు.
రైతులు వ్యవసాయం చేసుకునే సమయంలో ఎలాంటి అవాంతరాలు లేకుండా పంటలు సమృద్ధిగా పండాలని, పాడి పంటలతో రైతులు సుఖశాంతులతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు.


