Friday, February 27, 2026

కరీంనగర్ మేయర్ పీఠంపై కాంగ్రెస్ గురి..

  • తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ చార్జి వెలిచాల రాజేందర్ రావు
  • జెండా ఎగరడం ఖాయం అంటున్న పార్టీ శ్రేణులు
  • వివిధ పార్టీల్లో నుంచి కాంగ్రెస్ లోకి చేరుతుండడంతో కొత్త ఉత్సాహం

కరీంనగర్, నిఘా న్యూస్: కరీంనగర్ నగర రాజకీయాల్లో రోజురోజుకు వేడి పెరుగుతోంది. త్వరలో జరగనున్న కరీంనగర్ మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు కరీంనగర్ మేయర్ పీఠంపై ప్రత్యేక దృష్టి పెట్టాయి. ఒకప్పుడు బీఆర్ఎస్‌కు కంచుకోటగా ఉన్న కరీంనగర్‌లో మారుతున్న రాజకీయ సమీకరణలు ఆసక్తికరంగా మారాయి. మూడు పార్టీలూ తమ తమ బలాబలాలను అంచనా వేసుకుంటూ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికలు కీలకంగా మారాయి. అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా వెలిచాల రాజేందర్ రావు నియామకం కావడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. ముఖ్యంగా మేయర్ పీఠంపై ఈసారి కాంగ్రెస్ జెండా ఎగరవేయాలనే ఆశలు బలపడుతున్నాయి. ఇటీవలి కాలంలో బీఆర్ఎస్, బీజేపీల నుంచి పలువురు కీలక నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలోకి చేరడం ఈ ఆశలకు మరింత బలం చేకూరుస్తోంది.

వెలిచాల రాజేందర్ రావు అసెంబ్లీ ఇన్‌చార్జిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి పార్టీని కిందిస్థాయి వరకు బలోపేతం చేసే పనిలో నిమగ్నమయ్యారని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. రోజూ వార్డుల వారీగా కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తూ, స్థానిక సమస్యలపై ఫోకస్ పెట్టడం ద్వారా ప్రజల్లో పార్టీకి అనుకూల వాతావరణం కల్పిస్తున్నారని అంటున్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చే నాయకులను గౌరవంగా ఆహ్వానిస్తూ, వారికి తగిన ప్రాధాన్యం ఇస్తూ ముందుకు తీసుకెళ్తున్న తీరు పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

కరీంనగర్ నగరంలో అభివృద్ధి, పారదర్శక పాలన, ప్రజల సమస్యల పరిష్కారం అనే నినాదాలతో కాంగ్రెస్ ముందుకు వెళ్తోందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి పక్కా ప్రణాళికతో ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ముఖ్యంగా యువత, మహిళలు, మధ్యతరగతి వర్గాలను ఆకర్షించేలా ప్రచార కార్యక్రమాలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.

మొత్తంగా చూస్తే, కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ పీఠంపై ఈసారి తీవ్ర పోటీ తప్పదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వెలిచాల రాజేందర్ రావు నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కృషి ఫలిస్తే, రాబోయే ఎన్నికల్లో కరీంనగర్ మేయర్ పీఠం కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయని పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular