రంగంలో మంత్రులు, ఎమ్మెల్యేలు
నేటితో ముగియనున్న ప్రచారం
ఎవరి ధీమా వారిదే..
కరీంనగర్ టౌన్, నిఘా న్యూస్: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ప్రచార హోరు పెరిగింది. మంత్రులు ఎమ్మెల్యేలు రంగంలోకి దిగారు. ఇంటింటా ప్రచారం సాగిస్తున్నారు. సోమవారం సాయంత్రం తో ప్రచారం ముగియనుంది.ఎన్నికల ప్రచారంలో రోజు లు దగ్గర పడుతున్న కొద్దీ ప్రచార తీవ్రత పెరుగుతుంది. ఇందులో భాగంగా ఏకంగా మంత్రులు, ఎమ్మెల్యేలు రంగంలోకి దిగారు. కార్నర్ మీటింగులు, ఇంటింటా తిరిగి ప్రచారాలతో హోరెత్తుతున్నాయి. అభ్యర్థితో పాటు వారిని బలపరిచే కార్యకర్తలు సైతం వెంట నడుస్తున్నారు. ఏ వీధిలో చూసినా ఇదే వాతావరణం కొనసాగుతోంది. ఉమ్మడి జిల్లాలో రెండు కార్పొరేషన్ లతో పాటు 13 మున్సిపాలిటీలు ఉన్నాయి.
కరీంనగర్ కార్పొరేషన్ పై అన్ని పార్టీలు ప్రత్యేక దృష్టి సారించాయి. నగరంలో మంత్రి శ్రీధర్ బాబు కార్నర్ మీటింగులు నిర్వహించారు. కొన్నిచోట్ల వీధుల్లో తిరుగుతూ ఓటర్లను కలిశారు. ఇదే రీతిలో హుస్నాబాద్, హుజురాబాద్ పట్టణాల్లో ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్ కలిసి కలియతిరిగారు. మంత్రి పొన్నం ప్రభాకర్ సొంత నియోజకవర్గం కావడంతో హుస్నాబాద్ లో ఈ ప్రచారం మరింత ఉత్సాహంగా సాగింది. ఇంటింటా ప్రచారం కొనసాగించారు. హుజురాబాద్ నియోజకవర్గం లో ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్న నేపథ్యంలో ఎలాగైనా ఆ మున్సిపాలిటీలు చేజిక్కించుకోవాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా అక్కడ సైతం అదే రీతిలో ప్రచారం కొనసాగించారు.
సొంత నియోజకవర్గమైన ధర్మపురిలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వీధివీధినా ప్రచారం లో పాల్గొన్నారు. సిరిసిల్ల వేములవాడ మున్సిపాలిటీలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రచారం నిర్వహిస్తున్నారు. అలాగే బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. తన పట్టు సడలకుండా ఉండేందుకు అక్కడే తిష్ట వేశారు. కరీంనగర్లో గెలుపును స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి గంగుల కమలాకర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దీంతో ప్రతి డివిజన్లోను కలియ తిరుగుతున్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ సైతం తన సొంత నియోజకవర్గ కావడంతో కరీంనగర్ ఉమ్మడి జిల్లా పై దృష్టి సారించారు. అందులోనూ నగరంలో పట్టు నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఒక పార్టీపై మరో పార్టీ నేతలు తీవ్రంగా విమర్శల వర్షం కురిపిస్తున్నారు. తమ పార్టీకే ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. గతంలో చేసిన అభివృద్ధిని చూసి ఓటు వేయాలని బిఆర్ఎస్ నేతలు కోరుతున్నారు. వారు 10 ఏళ్లలో చేయని అభివృద్ధిని రెండేళ్లలో చేశామని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. కేంద్ర మంత్రి సంజయ్ మాత్రం కేంద్ర ప్రభుత్వ నిధులు నగరాలు పట్టణాలకు కేటాయించిన అంశాన్ని వివరిస్తున్నారు. మొత్తంగా బరిలో ఉన్న అభ్యర్థులు తమ నాయకులు చేస్తున్న విస్తృత పర్యటనతో సంతృప్తిగా ఉన్నారు. మరోవైపు తమ వంతు ప్రయత్నాలు విరివిగా చేస్తున్నారు. ప్రతి ఓటరును కలవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ఓటరు మాత్రం తెలివిగా అందరికీ సానుకూల హామీలు ఇవ్వడం పరిపాటే. ఏది ఏమైనా అభ్యర్థుల భవితవ్యం పార్టీల భవితవ్యం 13న తేల నుంది.


