ప్రాణాలు పోతే గాని అధికారులు స్పందించరా…?
ఇసుక ట్రాక్టర్లకు వేగాన్ని నియంత్రించండి…
గంభీరావుపేట (నిఘా న్యూస్) గంభీరావుపేట మండలంలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. రాత్రి పగలు అనే తేడా లేకుండా తరలింస్తున్నారు.మార్కెట్‌లో ఒక్కో ట్రాక్టర్ సుమారు రూ.4నుంచి నుంచి రూ.5వేల వరకు ధర పలుకుతుంది.దీంతో ఈ వ్యాపారం మూడు పూలు, ఆరు కాయలుగా సాగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇన్సూరెన్స్ పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్ లేని మైనర్లతో పగలు రాత్రి తేడా లేకుండా అడ్డగోలుగా ఇసుక రవాణా జరుపుతున్నారని ఆయా గ్రామాల ప్రజలు పేర్కొంటున్నారు. అక్రమ రవాణాకు ఎలాంటి అవరోధాలు లేకుండా ప్రతినెలా ఒక్కో ట్రాక్టర్, చొప్పున భారీ ముడుపులు చేతులు మారుతున్నట్లు వారు ఆరోపిస్తున్నారు. ఇందుకు తెరవెనుక ప్రజాప్రతినిధులు కూడా అధికారులు, మాఫియాకు వెన్నుదన్నుగా ఉన్నట్లు సమాచారం. అలాగే, ఎలాంటి అనుమతులు పొందకుండా ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టడంతో పాటు సహజ వనరును అడ్డగోలుగా దోచుకుంటున్నారు. దీనికి తోడు రోడ్లపై మితిమీరిన వేగంతో ట్రాక్టర్లను డ్రైవింగ్ లైసెన్స్ లేని మైనర్లు నడపడంతో పలువురు రోడ్డు ప్రమాదంలో బలవుతున్నారు. ఇసుక ట్రాక్టర్లు రోడ్డుపై వస్తుంటే ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వెళ్తున్నారు. మితిమీరిన వేగంతో నువ్వా నేనా అన్నట్టు దూసుకు వస్తున్నాయని ప్రజలు భయాందోళనలకు గురవుతున్నామని వాపోతున్నారు.
అనుమతి లేకుండా తీసుకెళ్తున్నారు..
ఎగదండీ స్వామి, మాజీ ఎంపీటీసీ బిఆర్ఎస్ నేత, గంభీరావుపేట

ఎలాంటి అనుమతి లేకుండా ఇసుక లోడ్‌తో వెళుతున్న ట్రాక్టర్ ఎవరి కంటా పడకుండా ప్రధాన, గల్లీ రోడ్లలో కూడా మితిమీరిన వేగంతో నడుపుతున్నారు. కనీసం ఇన్సూరెన్స్ కూడా ప్రభుత్వానికి చెల్లించకపోవడంతో ప్రమాదం జరిగితే బాధితుడు నష్టపోతున్నాడు. సరైన దారి గుండా వెళ్తున్నప్పటికీ అతివేగంతో ఢీ కొట్టడంతో ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. ఇంత జరుగుతున్నా (పోలీస్, మైనింగ్, రెవెన్యూ)అధికారులుఎందుకు పట్టించుకోవడం లేదు. ఇసుక ట్రాక్టర్ల యజమానులను పిలిపించి, ట్రాక్టర్ల వేగాన్ని నియంత్రించండి.