Friday, February 27, 2026

కరీంనగర్ మేయర్ పీఠంపై గురి..

నగరంలో వేడెక్కిన రాజకీయ వాతావరణం
రిజర్వేషన్ల ప్రకటనతో ప్రధాన పార్టీల వ్యూహాలు

కరంనగర్, నిఘా న్యూస్: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ప్రకటించిన వెంటనే కరీంనగర్ జిల్లాలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ముఖ్యంగా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవి ఈసారి ఏ పార్టీకి దక్కుతుందన్న దానిపై ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇప్పటి నుంచే ప్రధాన పార్టీలన్నీ వ్యూహాత్మకంగా కదలికలు ప్రారంభించడంతో జిల్లా రాజకీయాలు వేడెక్కాయి.

ఇప్పటి వరకు కరీంనగర్ నగర రాజకీయాల్లో బలంగా కనిపించిన బీఆర్ఎస్‌కు ఈసారి గట్టి పోటీ తప్పదనే అంచనాలు వినిపిస్తున్నాయి. ఒకవైపు బీజేపీ, మరోవైపు కాంగ్రెస్ పార్టీలు మేయర్ పదవిని లక్ష్యంగా చేసుకుని బలమైన ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నాయి. రిజర్వేషన్ల ప్రకటనతో పాటు అభ్యర్థుల ఎంపిక, వార్డుల సమీకరణలపై పార్టీల్లో అంతర్గతంగా చర్చలు ఊపందుకున్నాయి.

కాంగ్రెస్ పార్టీలో ఇన్ని రోజులుగా నాయకత్వ లోపం ఉందన్న విమర్శలు వినిపించాయి. అయితే ఇటీవల కార్పొరేషన్ అధ్యక్షుడిగా వైద్యుల అంజన్ కుమార్, డీసీసీ అధ్యక్షుడిగా మేడిపల్లి సత్యం, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా వెలిచాల రాజేందర్ రావులను నియమించిన తర్వాత పరిస్థితి మారుతోందని కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నాయి. ఈ ముగ్గురు నేతల సమన్వయంతో నగరంలో పార్టీని బలోపేతం చేసి, మేయర్ పదవిని కైవసం చేసుకునే అవకాశం ఉందన్న చర్చ మొదలైంది. గతంలో కాంగ్రెస్‌కు ఉన్న ఓటు బ్యాంక్‌ను తిరిగి ఆకర్షించగలిగితే విజయం సాధ్యమేనని పార్టీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఈసారి కరీంనగర్ మేయర్ పీఠాన్ని ఎలాగైనా బీజేపీ ఖాతాలో వేసుకోవాలనే పట్టుదలతో ఉన్నారు. ఇప్పటికే నగరంలో విస్తృతంగా పర్యటనలు చేస్తూ, పార్టీ శ్రేణులను చురుగ్గా ఉంచుతున్నారు. కరీంనగర్ తన రాజకీయ కంచుకోటగా భావించే బండి సంజయ్, మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని అన్ని వార్డుల్లో గట్టి పోటీ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ఇక బీఆర్ఎస్ కూడా ఈ పోరులో వెనక్కి తగ్గే పరిస్థితి లేదు. గత పాలనలో నగరంలో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లుతూ, మరోసారి మేయర్ పదవిని దక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది. అనుభవజ్ఞులైన కార్పొరేటర్లతో పాటు కొత్త ముఖాలకు కూడా అవకాశం ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

మొత్తానికి కరీంనగర్ మేయర్ ఎన్నిక ఈసారి త్రిముఖ పోరుగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రిజర్వేషన్లు, అభ్యర్థుల ఎంపిక, పార్టీల వ్యూహాలు ఎలా ఉంటాయన్నదానిపై ఆధారపడి నగర రాజకీయాల దిశ మారనుంది. ప్రజలు ఎవరికి పట్టం కడతారన్నది ఆసక్తికరంగా మారింది.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular