బాధితుల ఆందోళన తీవ్రం
వేములవాడ, నిఘా న్యూస్:వేములవాడ పట్టణంలో తిప్పాపూర్ బస్టాండ్ నుండి శ్రీ రాజరాజేశ్వర ఆలయం వరకు చేపడుతున్న రోడ్డువిస్తరణ పనులు మళ్లీ ప్రారంభమయ్యాయి. కొద్ది రోజులుగా నిలిచిపోయిన ఈ పనులకు సోమవారం వేకువజామున పునర్ ప్రారంభం అయినయి . అధికారులు జేసిబిల సాయంతో తిప్పాపూర్ బస్టాండ్ ఎదుట ఉన్న పలు పాత భవనాలు, దుకాణ సముదాయాలు, రేకుల షెడ్డులను తొలగించారు. ఈ కూల్చివేతల తర్వాత మూలవాగు వద్ద నిర్మాణంలో ఉన్న రెండో వంతెన పనులను ప్రారంభించనున్నారు.
అయితే ఈ కూల్చివేతలపై బాధితులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తమకు తగిన పరిహారం అందకముందే అకస్మాత్తుగా కూల్చివేతలు చేపట్టారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండానే భవనాలను కూల్చడంపై వారు మండిపడుతున్నారు. ఈ ఉద్రిక్తత మధ్య ఓ బాధితుడు సమీపంలో ఉన్న భారీ హోర్డింగ్ పైకి ఎక్కి నిరసన తెలుపగా, అక్కడే ఉన్న పోలీసులు అతనిని నచ్చజెప్పి కిందికి దింపారు. సంఘటన ప్రదేశంలో కాసేపు ఉద్రిక్తత నెలకొంది.

ఘటన స్థలంలో ఎలాంటి అవాంఛనీయ పరిణామాలు చోటు చేసుకోకుండా ఉండేందుకు పట్టణ సీఐ వీరప్రసాద్ ఆధ్వర్యంలో 60 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు. అయినప్పటికీ, బాధితులు అధికారులపై ఆగ్రహంతో స్పందిస్తూ “తమ పాపం ఊరికే పోదు, ప్రభుత్వం మాపై అన్యాయం చేస్తోంది” అంటూ నిలదీశారు. దీంతో అధికారులు కొంతసేపు అప్రమత్తంగా వ్యవహరించాల్సి వచ్చింది.
అయినా అధికారులు మాత్రం తాము ఉన్నతాధికారుల ఆదేశాలతోనే ఈ చర్యలు చేపడుతున్నామని, పనులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపేది లేదని స్పష్టం చేశారు. నష్టపోయిన ప్రజలకు పరిహారం అందించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.