కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా ప్రచారం
విజిలెన్స్ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు
బొమ్మకల్ పంచాయతీ పరిధిలో పాత తేదీలతో ఇంటినంబర్ల మార్పుపై చీటింగ్ కేసు నమోదు
అయోమయంలో కార్యకర్తలు
కరీంనగర్, నిఘాన్యూస్: లోక్సభ ఎన్నికల ముంగిట కరీంనగర్ కాంగ్రెస్ పార్టీలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పార్టీ అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు దాటకముందే రోజు కో రకమైన ట్విస్టులతో కార్యకర్తలు ఖంగుతింటు న్నారు. తాజాగా కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి పురుమల్ల శ్రీనివాస్ వ్యవహారం పార్టీ యంత్రాంగాన్ని బేజారుపరుస్తున్నది. అసెంబ్లీ ఎన్నికలకు ముందే పార్టీలో చేరి టికెట్టు దక్కించుకున్న పురుమల్ల శ్రీనివాస్ గతంలో పలు అవినీతి కేసుల్లో ఇరుక్కొని జైలుకు వెళ్ళి వచ్చారు.
బొమ్మకల్ పంచాయతీ పరిధిలో పాత తేదీలతో ఇంటినంబర్లు
బొమ్మకల్ గ్రామపంచాయతీ పరిధిలో కొందరికి నకిలీ ఇంటి నెంబర్లు ఇచ్చాడనే ఫిర్యాదుపై కాంగ్రెస్పార్టీ కరీంనగర్ అసెంబ్లీ ఇంచార్జి, బొమ్మకల్ మాజీ సర్పంచ్ పురుమల్ల శ్రీనివాస్పై కరీంనగర్ రూరల్ ఠాణాలో ఈ నెల 19న చీటింగ్ కేసు నమోదైంది. శ్రీనివాస్తో పాటు గతంలో బొమ్మకల్ పంచాయతీ సెక్రటరీగా పనిచేసిన వాజిర్ అహ్మద్, పాత తేదీలలో ఇంటినెంబర్లు తీసుకున్న మరో ముగ్గురిపై పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. 2016కు సంబంధించిన వ్యవహారంలో బొమ్మకల్ గ్రామ పరిధిలోని ఒక స్థలంలో పాత తేదీలతో ఇంటి నెంబర్లు ఇచ్చి అవినీతికి పాల్ప డ్డారని, దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్య లు తీసుకోవాలని ఖాజా రవికిరణ్, సందీప్లు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విజిలెన్స్ పోలీసులు విచారణ జరిపి రాష్ట్ర చీఫ్ సెక్రటరీకి ఇటీవల నివేదిక అందజేశారు. ఈ నివేదిక ఆధారంగా చీష్ సెక్రటరీ జిల్లా కలెక్టర్కు ఆదేశాలు జారీ చేయగా అక్కడి నుంచి డీపీఎల్కు ఆదేశాలు వెళ్లాయి. డీపీఎల్ రాంబాబు ఫిర్యాదుతో కరీంనగర్ రూరల్ పోలీసులు పురుమల్ల శ్రీనివాస్, వాజిర్ అహ్మద్, మరో ముగ్గురిపై చీటింగ్ తో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఈ మేరకు నింధితుల కోసం వెతుకుతున్నట్లు సీఐ ఏ ప్రదీప్ కుమార్ తెలిపారు.