జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి
సంగారెడ్డి 12(కలం నిఘా న్యూస్) ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు అన్నీ ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ మిని సమావేశం కో ఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భగా జిల్లాలో ఫిబ్రవరి 28 నుండి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఫిబ్రవరి 28 నుండి మార్చి, 16 వరకు జరుగు ఇంటర్మీడియట్ పరీక్షలకు కట్టు దిట్టమైన ఏర్పాట్లు చేయాలన్నారు. సంబంధిత అధికారులు సమన్వయంతో ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు 52 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్షలు ఉదయం 9:00 గంటల నుండి మ.12:00 గంటల వరకు జరుగుతాయని తెలిపారు. ఇంటర్మీడియట్ పరీక్షలకు జిల్లాలో మొత్తం 36,153 మంది హాజరు కానున్నారని,అందులో ప్రథమ సంవత్సరం పరీక్షలకు 17,665 మంది విద్యార్థులు, రెండవ సంవత్సరం పరీక్షలకు 18,488 మంది విద్యార్థులు హాజరు కానున్నట్లు తెలిపారు.
ప్రశ్న పత్రాల స్టోరేజ్ పాయింట్లు 17 ఏర్పాటు చేస్తున్నట్లు, రెండు ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్లు, నాలుగు సిట్టింగ్ స్క్వాడ్ టీములను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీస్ శాఖ గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేయాలని, పరీక్షా కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ విధించాలని, పరీక్షా సమయంలో పరీక్షా కేంద్రాల ఏరియాలలో జీరాక్స్ సెంటర్లు మూసివేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థులు గంట ముందు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని తెలిపారు. విద్యార్థులు సకాలంలో పరీక్షలకు హాజరయ్యేలా పరీక్ష సమయానికి అనువుగా ఆర్టీసీ అధికారులు బస్సులను నడపాలని, పరీక్షా కేంద్రాల వద్ద ఫస్ట్ ఎయిడ్ కిట్స్, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మందులతో ఒక ఎ,ఎన్,ఎమ్ ను కేంద్రాల వద్ద అందుబాటులో ఉండేలా వైద్య అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. విద్యుత్ శాఖ అధికారులు పరీక్షా సమయంలో ఎటువంటి విద్యుత్ అంతరాయం లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పరీక్షా కేంద్రాలలో త్రాగునీరు తదితర మౌలిక వసతులు ఉండేలా అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా ఇంటర్మీడియట్ అధికారి గోవింద్ రామ్, సంబంధిత శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.