బిల్లుల పేరుతో లక్షల్లో మోసం మధ్యతరగతి, పేదలకు మెడికల్ ఎమర్జెన్సీ అంటే ఆర్థిక విపత్తే!
హైదరాబాద్ , నిఘా న్యూస్: ఈ రోజుల్లో ఆరోగ్య సేవలు మానవహక్కుల కంటే వ్యాపార మోడల్‌గా మారిపోయాయి. ముఖ్యంగా ప్రైవేట్ హాస్పిటళ్ల దోపిడీ ప్రజల ప్రాణాలను మించిన లాభాలపై ఆధారపడి నడుస్తోంది. ఓ సాధారణ ఫీవర్ గానీ, యాక్సిడెంట్ గానీ, చిన్నపాటి ఆపరేషన్ గానీ అయినా బిల్లులు మాత్రం లక్షల్లో ఉంటున్నాయి.
ప్రైవేట్ హాస్పిటళ్లలో అడుగు పెట్టిన క్షణం నుంచి బెడ్ ఛార్జెస్, ఐసీయూ ఛార్జెస్, వెంటిలేటర్ ఛార్జెస్, కాటన్ నుండి క్రీమ్ వరకు అన్నీ బిల్లు చేసుకుంటున్నారు. అంతేగాక డాక్టర్ల కన్సల్టేషన్ పేరుతో ప్రతిరోజూ వేర్వేరు డాక్టర్ల పేర్లు బిల్లులో చేరుతున్నాయి. హాస్పిటల్ డాక్యుమెంట్స్ చదవగల సామర్థ్యం లేని కుటుంబాలు లక్షల్లో చెల్లించి, చివరికి అప్పుల్లో మునిగిపోతున్న పరిస్థితి.
హైదరాబాద్‌లో ఇటీవల జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో బాధితుడిని దగ్గర్లో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. నాలుగు రోజుల పాటు ఐసీయూలో ఉంచిన అనంతరం అతను మరణించాడు. కానీ కుటుంబానికి ఇచ్చిన బిల్లు రూ. 9 లక్షలు.ఇందులో మెడిసిన్‌కు రూ. 2 లక్షలు, ఐసీయూ ఛార్జెస్ రూ. 3 లక్షలు, డాక్టర్ ఫీజులు రూ. 1.5 లక్షలు ఇలా విపరీతంగా ఉన్నాయి.ఈ పరిస్థితులపై ప్రభుత్వం ఏమి చర్యలు తీసుకోవడం లేదు అనే విమర్శలు వస్తున్నాయి. ఆరోగ్య శాఖ నిబంధనలు ఉన్నప్పటికీ వాటిని అమలు చేయడంలో తీవ్ర లోపాలున్నాయి. చాలా హాస్పిటల్స్‌లో రేట్ కార్డులు కనిపించవు, బిల్లుల వివరాలు సరిగా ఇవ్వరు, బీమా సేవల పేరుతో మోసం జరుగుతోంది.