6 గ్యారంటీలను ఎట్లా అమలు చేస్తారు?
అందరికే పథకాలంటూ కొందరికే పరిమితం చేస్తున్న కాంగ్రెస్
పంట నష్ట పోయిన రైతులను నిండా ముంచిన కేసీఆర్
చొప్పదండి నియోజకవర్గంలోని గంగాధర ప్రజాహిత యాత్రలో బండి సంజయ్
కరీంనగర్, నిఘా న్యూస్:రాష్ట్ర ప్రభుత్వం జీతాలివ్వడానికే పైసల్లేవని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీలను ఎట్లా అమలు చేస్తారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. 6 గ్యారంటీలను అందరికీ అమలు చేస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన కాంగ్రెస్ కొందరికే పరిమితం చేస్తోందని మండిపడ్డారు. ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వకుండా రేషన్ కార్డు ప్రాతిపదికగా 6 గ్యారంటీలను అమలు చేయడం విడ్డూరమని విమర్శించారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ నుండి ప్రధాని అభ్యర్ధి ఎవరో చెప్పలేని దుస్ధితి నెలకొందన్నారు. చొప్పదండి సహా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో సాగు నీటిని విడుదల చేయకపోవడంతో చాలా రైతులు పండించిన పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొందన్నారు. తక్షణమే ప్రభుత్వం సాగునీటిని విడుదల చేయాలని, లేనిపక్షంలో ఇరిగేషన్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.