ఓటుకు నోటు ఇచ్చేందుకు అభ్యర్థుల రెడీ..?
తీసుకొని తమకే ఓటు వేయాలని కొందరి ప్రచారం
అలా చేస్తే ప్రజాస్వామ్యానికి ప్రమాదం అని మరికొందరి వాదన..
అధికారులు పోలీసుల చర్యలు ఎలా ఉంటాయో?
కరీంనగర్, నిఘా న్యూస్:మరికొన్ని రోజుల్లో కరీంనగర్ అదిలాబాద్ నిజామాబాద్ మెదక్ మెదక్ జిల్లాల పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అభ్యర్థుల ప్రచారాలు హోరెత్తుతున్నాయి. పార్టీల తరఫున బరిలో ఉన్న వారికి ఆయా పార్టీల నాయకులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఎవరికి వారే తమదే గెలుపు అన్నట్లుగా జోరుగా పట్టభద్రులను కలుస్తున్నారు. కొందరు హామీలు ఇస్తూ.. మరికొందరు వారి సమస్యలను పరిష్కరిస్తామంటూ చెబుతూ పట్టభద్రులను, ఉపాధ్యాయులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే కొందరు ఒక అడుగు ముందు వేసి నయానో భయానో ముట్ట చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇవి వస్తువుల రూపంలోనూ.. నగదు రూపంలోనూ ఉంటున్నాయని కొందరు చర్చించుకుంటున్నారు.
సాధారణ ఎన్నికల్లో బరిలో ఉండే అభ్యర్థులు గెలిచేందుకు ఓటర్లను ఆకట్టుకోవాలని రకరకాల ప్రయత్నాలను చేస్తూ ఉంటారు. అయితే ఒకప్పుడు పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు అభ్యర్థులను చూసి ఓటు వేసేవారు. కానీ ఈ ఎన్నికల్లో రాజకీయ పార్టీల హోరు ఎక్కువగా ఉండడంతో తమ పార్టీ గెలవాలని ఉద్దేశంతో ఓటర్లను ఆకట్టుకోవాలని నగదు బహుమానంగా ఇస్తున్నట్లు తెలుస్తోంది. సాధారణ ఎన్నికల్లో అయితే పార్టీ నాయకులు లేదా కార్యకర్తలు తమ వార్డు లేదా వింగ్ వారికి డబ్బులు ఇస్తారని కొందరు అంటున్నారు. కానీ ఇప్పుడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ డబ్బులు ఇచ్చేందుకు కొందరు అభ్యర్థులు రెడీ అవుతున్నారని ఆరోపిస్తున్నారు.
ఇలా ఒక్కో ఓటుకు రూ .5,000 నుంచి రూ.10000 వరకు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే కొందరు అభ్యర్థులు డబ్బులు ఇస్తే తీసుకోండి.. కానీ తమకే ఓటు వేయండి.. అంటూ బాహటంగానే ప్రచారం చేస్తున్నారు. దీనిని బట్టి తెలుస్తుంది ఏందంటే ఈ ఎన్నికల్లోను డబ్బు ప్రవాహం ఎక్కువగానే ఉంటుందని కనిపిస్తోంది. అయితే డబ్బులు తీసుకొని ఓటు వేయడం వల్ల నష్టం ఉండే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని మరికొందరు అభ్యర్థులు ప్రచారం చేస్తున్నారు. అయినా అవి ఏమీ పట్టించుకోకుండా తాము గెలవాలని పట్టుదలతో కొందరు డబ్బులు ఇచ్చేందుకు రెడీగా ఉన్నారని ఆరోపిస్తున్నారు. మరి ఈ విషయంలో పోలీసులు, సంబంధిత అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారు చూడాలి.