Sunday, August 10, 2025

రబ్బర్‌ స్టాంప్‌ అధ్యక్షుడు వద్దు

సీనియర్లు, శ్రేణులకు కమిటీలో సముచిత స్థానం కల్పించాలి

సీఎంతో కొత్త అధ్యక్షుడు రహస్య మంతనాలు చేయొద్దన్న రాజాసింగ్‌

అధ్యక్ష పదవి రేసులో లేనన్న కేంద్ర మంత్రి బండి సంజయ్

హైదరాబాద్, నిఘా న్యూస్: తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి నియామకంపై అనిశ్చితి కొనసాగుతున్న నేపధ్యంలో ఆ పార్టీ ఎమ్మెల్యే టీ రాజాసింగ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడిని రాష్ట్ర కమిటీ నిర్ణయిస్తే రబ్బర్‌ స్టాంప్‌గానే మిగిలిపోతాడని ఆరోపించారు. ఒకవేళ కేంద్ర కమిటీ నిర్ణయిస్తే, బీజేపీకి తెలంగాణలో మంచి భవిష్యత్‌ ఉంటుందని చెప్పారు. దీని సంగతి బీజేపీ అధిష్టానం చూసుకుంటుందన్నారు. గతంలో బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షులుగా పనిచేసిన వారు గ్రూపు రాజకీయాలతో పార్టీకి తీవ్రనష్టం చేశారని ఆరోపించారు. తెలంగాణ బీజేపీశాఖకు వచ్చే కొత్త అధ్యక్షుడు.. రాష్ట్ర సీఎంతో రహస్య మంతనాలు జరుపుతూ బ్యాక్‌డోర్‌ రాజకీయాలు చేయొద్దని హితవు పలికారు. ఇప్పుడు వచ్చే బీజేపీ అంటే హిందూత్వ పార్టీ అని, ధర్మం కోసం పని చేసే కార్యకర్తలను బీజేపీ తెలంగాణశాఖ నూతన అధ్యక్షుడు గుర్తించి, వారికి సముచిత స్థానం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో పేరు ప్రఖ్యాతులు ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు నేతల చేతులు కట్టి పడేస్తున్నారన్నారు. గతంలో బీజేపీని నమ్ముకున్న సీనియర్‌ నాయకులు, కార్యకర్తలను పక్కనబెట్టారని రాజాసింగ్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

ముందు పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లినా తన మాట వినకపోతే ప్రజల ముందు పెడుతున్నానని రాజాసింగ్‌ చెప్పారు. ఏదైనా సమస్య ఉంటే పార్టీ పెద్దలకు చెప్పాలే గానీ, మీడియా ముందుకు ఎందుకు వెళుతున్నారని తనపై అవాకులు చెవాకులు పేలుతున్నారని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్రస్థాయిలో నామినేటెడ్‌ పోస్టులు ఉన్నా ఉద్దేశపూర్వకంగానే ఎవరికీ ఇవ్వడం లేదని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే, తాను అధ్యక్ష పదవి రేసులో లేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ స్పష్టం చేశారు. పార్టీ అధిష్టానం తనకు కేంద్రమంత్రి పదవి బాధ్యత అప్పగించిందన్నారు. పార్టీ నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే తనకు ముఖ్యం అని చెప్పారు. క్రమశిక్షణ గల కార్యకర్తగా పార్టీ హై కమాండ్‌ నిర్ణయమే శిరోధార్యం అని స్పష్టం చేశారు. ఇప్పటికే బీజేపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడి నియామకంపై రెండు, మూడు సార్లు అభిప్రాయ సేకరణ జరిపినా, పార్టీ అధ్యక్షుడిగా తనను బాధ్యతల నుంచి ఎప్పుడు తప్పిస్తారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఎదురుచూస్తున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకంపై అసాధారణ జాప్యంతో పార్టీ శ్రేణుల్లో నిరాశా నిస్పృహలు నెలకొన్నాయి.. KP

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular