కొందరికి నిరాశ..
ముడుపులు తీసుకొని మద్దతు తెచ్చుకుంటున్నారని ఆరోపణలు
కరీంనగర్, నిఘా న్యూస్: ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ రావడంతో నాలుగు జిల్లాల్లో సందడి నెలకొంది. అదిలాబాద్ కరీంనగర్ నిజామాబాద్ మెదక్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం ఖాళీ కావడంతో ఈ స్థానంలో ఎన్నిక అనివార్యమైంది. ఇప్పటివరకు ఈ స్థానంలో ఎమ్మెల్సీగా జీవన్ రెడ్డి కొనసాగారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. 2019లో ఎన్నిక అయిన ఆయన పదవీకాలం ఇటీవలే ముగిసింది. దీంతో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో జనవరి 29 నుంచే ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆయా రాజకీయ పార్టీలు ఎమ్మెల్సీ స్థానాన్ని దక్కించుకోవడానికి ఇప్పటినుంచే సమాయత్తమవుతున్నారు.
2019 సమయంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నా.. కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన జీవన్ రెడ్డి గెలుపొందారు. కానీ ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. దీంతో కాంగ్రెస్ టికెట్ దక్కించుకుంటే గెలుపు సునాయాసమని చాలామంది భావిస్తున్నారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ మద్దతు కోసం ఇప్పటికే చాలామంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి కాంగ్రెస్ సపోర్ట్ చేసే ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఉందని చర్చించుకుంటున్నారు. ఇప్పటికే ఆయన సీఎం రేవంత్ రెడ్డి తో సహా పలువురు కాంగ్రెస్ ముఖ్య నాయకులను కలిశారు. అయితే అధిష్టానం నుంచి మాత్రం ఇప్పటివరకు గ్రీన్ సిగ్నల్ రాలేదు.
తాజాగా ఎన్నికల షెడ్యూల్ రావడంతో కాంగ్రెస్ తరపున పోటీ చేసేవారి పేరును ప్రకటించే అవకాశం ఉన్నది. దీంతో ఆయనకే టికెట్ కన్ఫామ్ అని వినిపిస్తోంది. మరోవైపు కొందరు కాంగ్రెస్ మద్దతు కోసం ఆశపడి భంగా పడిన వారు రకరకాలుగా ఆరోపణలు చేస్తున్నారు. కాంగ్రెస్ పెద్దలకు ముడుపులు అప్పజెప్పి టికెట్ తెచ్చుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నందువల్ల మద్దతు ఉంటే గెలుపు ఖాయమని కొందరు అనుకుంటున్నారు. ఇందుకోసం ఎంతకైనా డబ్బులు చెల్లించడానికి రెడీ అవుతున్నారని కొందరు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణల మధ్య కాంగ్రెస్ మద్దతు ఎవరికి ఉంటుందో చూడాలి..